ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ ఏఐ పెట్టుబడులు పెరుగుతున్న సమయంలో ఉద్యోగ భద్రతపై ఆందోళనలు కూడా పెరుగుతున్నాయి. కంపెనీలో పనిచేస్తున్న 4వేల 500 మందికి పైగా ఉద్యోగులు సీఈఓ సుందర్ పిచాయ్‌కు ఒక లెటర్ అందించారు. AI విస్తరణ పేరుతో ఉద్యోగాల కోతలు జరుగుతున్నాయనే ఆందోళన వ్యక్తం చేస్తూ.. భవిష్యత్తులో లేఆఫ్స్ సమయంలో ఉద్యోగులకు మెరుగైన రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్ మెంబర్స్ కాలిఫోర్నియాలోని గూగుల్ ప్రధాన కార్యాలయంలో సుందర్ పిచాయ్ ఆఫీసుకు అందించారు. కంపెనీ ఆర్థికంగా బలమైన స్థితిలో ఉన్నప్పటికీ ఉద్యోగాల తొలగింపులు కొనసాగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే లేఆఫ్స్ విషయంలో స్పష్టమైన విధానాలు, ఉద్యోగులకు భరోసా కల్పించే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
గూగుల్ ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు
* లేఆఫ్స్‌కు గురయ్యే ఉద్యోగులకు తప్పనిసరి సెవరెన్స్ ప్యాకేజీలు అందించాలి.
* ఉద్యోగాల తొలగింపులకు ముందు అన్ని విభాగాల్లో వాలంటరీ బైఅవుట్ అవకాశాలు కల్పించాలి.
* సెవరెన్స్ మొత్తాన్ని ఎక్కువ కాలం చెల్లించే పెయిడ్ లీవ్ రూపంలో పొందే అవకాశం ఇవ్వాలి.
* ఉద్యోగుల పనితీరు అంచనా విధానంలో మార్పులు చేసి, కేవలం టార్గెట్లు, కోటాల ఆధారంగా కాకుండా ప్రతిభ ఆధారంగా మూల్యాంకనం చేయాలి.
AI పెట్టుబడులు.. మరోవైపు ఉద్యోగ మార్పులు
గూగుల్ ప్రస్తుతం ఏఐ రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతోంది. కంపెనీ భవిష్యత్ వ్యూహంలో ఏఐ కీలక భాగంగా మారింది. గూగుల్ క్లౌడ్ లో ఇటీవల కొంతమంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. అలాగే చిన్న టీమ్‌లను పర్యవేక్షించే మేనేజర్ల సంఖ్యను కూడా తగ్గించినట్లు గతంలో నివేదికలు వచ్చాయి. ఆర్థిక ఫలితాల సమావేశంలో కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అనట్ అష్కెనాజీ, ఏఐ అభివృద్ధి కోసం పెట్టుబడులు కొనసాగుతాయని, అదే సమయంలో అవసరమైన నియామకాలు కూడా ఉంటాయని తెలిపారు. అయితే ఏఐ కారణంగానే లేఆఫ్స్ జరుగుతున్నాయని గూగుల్ అధికారికంగా ప్రకటించలేదు.
ALSO READ : EPF సభ్యులకు అలర్ట్..
టెక్ రంగంలో పెరుగుతున్న ఉద్యోగ భయం
గూగుల్ టెక్కీలు ఆందోళనలు కేవలం ఒక్క కంపెనీకే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో ఏఐ వాడకం పెరుగుతున్న కొద్దీ ఉద్యోగాల భద్రతపై చర్చ పెరుగుతోంది. కొన్ని పెద్ద కంపెనీలు పనిలోకి ఏఐని తీసుకొస్తూ ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. మెటా, ఒరాకిల్, బ్లాక్, మైక్రోసాఫ్ట్ కంపెనీల్లో కూడా ఉద్యోగాల కోతలు, AI పెట్టుబడులపై చర్చలు కొనసాగుతున్నాయి. ఏఐ వల్ల పనితీరు పెరుగుతుందని కంపెనీలు చెబుతున్నప్పటికీ, ఉద్యోగులు మాత్రం తమ భవిష్యత్తుపై స్పష్టమైన హామీలను కోరుతున్నారు.
గూగుల్ ఉద్యోగుల ఆందోళనలో ప్రధాన అంశం..
ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్ గతంలో కూడా ఉద్యోగుల సమస్యలపై గళమెత్తింది. ఇప్పుడు తాజా వినతిపత్రం ద్వారా ఉద్యోగ భద్రత, పారదర్శకత, న్యాయమైన పనితీరు అంచనా విధానాలపై దృష్టి పెట్టాలని యాజమాన్యాన్ని కోరుతోంది. దీంతో ఏఐ భవిష్యత్తును మార్చే శక్తిగా మారుతున్న సమయంలో, కంపెనీలు కొత్త సాంకేతికతను స్వీకరించడంతో పాటు ఉద్యోగుల భద్రతను ఎలా సమతుల్యం చేస్తాయన్నది కీలక ప్రశ్నగా మారింది. సుందర్ పిచాయ్‌కు అందిన ఈ వినతి టెక్ ప్రపంచంలో ఎలాంటి మార్పులకు నాంది పలుకుతుందనే చర్చకు దారితీసింది.
