ఘాగ్రా నదిలో కాళ్లు కడుక్కుంటుండగా దారుణం: కళ్లముందే 12 ఏళ్ల బాలుడిని నీటిలోకి లాక్కెళ్లిన మొసలి..

 ఘాగ్రా నదిలో కాళ్లు కడుక్కుంటుండగా దారుణం:  కళ్లముందే 12 ఏళ్ల బాలుడిని నీటిలోకి లాక్కెళ్లిన మొసలి..

ఉత్తర ప్రదేశ్‌లోని బహ్రాయిచ్ జిల్లాలో ఓ  ఘోర విషాదం జరిగింది. పొలంలో పని పూర్తి చేసుకోండి, కాళ్లు చేతులు కడుక్కోవడానికి నది ఒడ్డు  దగ్గరకు వెళ్లిన 12 ఏళ్ల బాలుడిపై మొసలి దాడి చేసింది. అందరూ చూస్తుండగానే ఆ పిల్లాడిని నదిలోకి లాక్కెళ్లి ప్రాణాలు తీసింది.

సమాచారం ప్రకారం.... బౌంది పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో సునీల్ అనే 12 ఏళ్ల బాలుడు ఆరో తరగతి చదువుతున్నాడు. గురువారం సాయంత్రం వరి నాట్లు వేయడంలో సహాయం చేయడానికి అతని మామతో కలిసి దగ్గరలోని పొలానికి వెళ్లాడు.

పని పూర్తయిన తర్వాత, ఇంటికి బయలుదేరే ముందు కాళ్లు, చేతులు కడుక్కోవడానికి ఇద్దరూ ఘాగ్రా నదీ తీరానికి వెళ్లారు. వారు నీళ్లలోకి దిగడమే ఆలస్యం.. ఒక పెద్ద మొసలి హఠాత్తుగా నీటిలోంచి పైకి వచ్చి సునీల్‌పై దాడి చేసి పట్టుకుంది.

కాపాడటానికి గ్రామస్తుల పోరాటం
మొసలి నోట్లో చిక్కుకున్న సునీల్ గట్టిగా అరుస్తూ విడిపించుకోవడానికి ప్రయత్నించాడు. ఆ అరుపులు విన్న అతని మామ గట్టిగా కేకలు వేయడంతో, చుట్టుపక్కల పొలాల్లో పనిచేస్తున్న రైతులు, గ్రామస్తులు పరుగు పరుగున నది ఒడ్డుకు చేరుకున్నారు.

పిల్లాడిని వదిలేలా చేయడానికి ప్రజలు మొసలిపై ఇటుకలు, రాళ్లు, కర్రలు విసిరారు. కానీ, వారి ప్రయత్నాలేవీ ఫలించలేదు. మొసలి బాలుడిని నది లోపలికి లాక్కెళ్లి చూస్తుండగానే అదృశ్యమైంది.

ఐదు గంటల తర్వాత 
పిల్లాడు బతికే ఉంటాడనే ఆశతో గ్రామస్తులు పొడవైన వెదురు కర్రలతో నదిలో గాలించడం మొదలుపెట్టారు. దాదాపు ఐదు గంటల పాటు వెతికిన తర్వాత సునీల్ శవం దొరికింది. అయితే, అప్పటికే మొసలి ఆ బాలుడి ఒక కాలు, పొట్ట భాగంలోని కొంత భాగాన్ని తినేసింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టంకి పంపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా ఆన్‌లైన్‌లో వైరల్ అయింది.

అనాథలైన ముగ్గురు అక్కలు
ఈ ప్రమాదం ఆ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. సునీల్ తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితమే చనిపోయారు. అతనికి ముగ్గురు అక్కలు ఉన్నారు. ఆ ముగ్గురు అక్కలకు సునీల్ ఒక్కడే తమ్ముడు. ఇప్పుడు తమ్ముడు కూడా చనిపోవడంతో ఆ కుటుంబం తీవ్ర శోకసముద్రంలో మునిగిపోయింది.

ప్రభుత్వం రూ.4 లక్షల సాయం
ఈ ఘటనపై అధికారులు స్పందించారు. బాధిత కుటుంబానికి రాష్ట్ర విపత్తు సహాయ పథకం కింద రూ.4 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ ప్రకాష్ సింగ్ తెలిపారు. ఘాగ్రా నదిలో మొసళ్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో నదిలో నీటిమట్టం పెరిగినప్పుడు, మొసళ్లు నది ఒడ్డుకు, పంట పొలాల్లోకి వస్తుంటాయి. అందుకే నదీ తీర ప్రాంత ప్రజలు, రైతులు నది దగ్గరకు వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని వన్యప్రాణి నిపుణులు హెచ్చరిస్తున్నారు.