మసుధ ఫేమ్ తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా భరత్ దర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఓ..! సుకుమారి’ (Oh Sukumari). హీరోయిన్‌ను ముట్టుకుంటే షాక్ కొట్టడం అనే యూనిక్ కాన్సెప్ట్తో మూవీ తెరకెక్కింది. విలేజ్ బ్యాక్‌డ్రాప్, ఎమోషన్స్ అందరికీ కనెక్ట్ అయ్యేలా సినిమా రూపొందింది. ఈ క్రేజీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇవాళ (జులై 17, 2026న) తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. వినూత్నమైన ప్రమోషన్స్, ట్రైలర్ కంటెంట్తో ఆకట్టుకున్న ‘ఓ..! సుకుమారి’ ఎలా ఉంది? వరుస చిత్రాలతో అలరిస్తున్న తిరువీర్, ఐశ్వర్య జోడీ ఎలాంటి మ్యాజిక్ చేసింది? అనేది రివ్యూలో చూసేద్దాం..
కథేంటంటే:
నరాల యాదగిరి (తిరువీర్) రాజకీయాల్లో రాణించాలనుకునే ఒక యువకుడు. అంతేకాదు యాదగిరి మహా పిసినారి కూడా. ఎదుటి వాళ్లు చెప్పేది పూర్తిగా వినడు. అలాంటి యాదగిరి ఊర్లో సర్పంచ్ అవ్వాలని అనుకుంటూ ఉంటాడు. ఇందుకోసం ఎలాగైనా తన తాతగారికి చెందిన రూ.80 కోట్ల ఆస్తి తనకు దక్కించుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. అందుకు ఒక విచిత్రమైన నిబంధనను నెరవేర్చాలని విషయం యాదగిరికి తెలుస్తుంది. ఇక ఆ ఆస్తిని ఎలాగైనా దక్కించుకోవాలనే ప్లాన్‌తో దామిని (ఐశ్వర్య రాజేష్) అనే అమ్మాయిని ప్రేమించి, పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతాడు.
Also Read : 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' హౌస్ సెట్ వర్క్ స్టార్ట్..
ఆశ్చర్యకరంగా, దామిని ఈ పెళ్లికి భయపడుతున్నప్పటికీ, ఊరి జనాలు మాత్రం తనను సాగనంపాలని బలంగా కోరుకుంటారు. దానికి కారణం ఆమెకొక విచిత్రమైన సమస్య ఉండటమే. చివరకు దామినీకి పెళ్లవుతుంది కానీ, వారి శోభనం రాత్రి మాత్రం ఇద్దరి మధ్య వింత సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఇక అక్కడి నుంచి కథలో అసలు ట్విస్ట్ మొదలవుతుంది. మరి ఈ జంట మధ్య ఉన్న ఆ రహస్యం ఏంటి? యాదగిరి ఆ 80 ఎకరాల ఆస్తిని దక్కించుకున్నాడా? లేదా? అనేదే మిగిలిన కథ.
విశ్లేషణ:
ఈ మూవీ ఒక ఇంట్రెస్టింగ్ లైన్‌ను తీసుకుని, దాని చుట్టూ కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, మరియు మిస్టరీని అల్లి ఒక కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు డైరెక్టర్ భరత్ దర్శన్. ముట్టుకోగానే షాక్ కొట్టే ఓ అమ్మాయి.. అది తెలియక ఆమెని పెళ్లి చేసుకున్న ఓ అబ్బాయి.. ఇలా ఆ ఇద్దరి మధ్య కలిసి కాపురం ఎలా సాగించారన్న పాయింట్ ఆసక్తిని రేకెత్తించే విషయమే.
సినిమా ప్రారంభంలో వినడానికి పాయింట్ చాలా బాగుంటుంది. దానికితోడు 80 కోట్ల ఆస్తి కోసం హీరో తనని పెళ్లి చేసుకోవడం, ఆ పెళ్లికి హీరోయిన్ భయపడుతున్నా ఊరంతా సపోర్ట్ చేయడం, అన్నింటికీ మించి 'శోభనం రాత్రి' చుట్టూ తిరిగే మిస్టరీ ట్విస్ట్.. ఇవన్నీ ఒక మంచి సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్‌కు కావాల్సిన కంటెంట్. కానీ, దర్శకుడు భరత్ దర్శన్ ఈ డిఫరెంట్ పాయింట్‌ను అంతే ఆసక్తికరంగా స్క్రీన్‌పైకి తీసుకురావడంలో విఫలమయ్యారు.
అంతేకాకకుండా ఈ సినిమాకు పెద్ద మైనస్ ప్రమోషన్లే అని చెప్పుకోవాలి. కథలోని అసలైన ట్విస్ట్‌ను ట్రైలర్‌లోనే రివీల్ చేయడంతో థియేటర్‌లో సస్పెన్స్, క్యూరియాసిటీ తగ్గిపోయింది. దీంతో స్క్రీన్‌ప్లేలో ఉండాల్సిన సర్‌ప్రైజ్ ఎలిమెంట్ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఫస్ట్ హాఫ్‌లో పెళ్లి చూపులు, ప్రీవెడ్డింగ్ షూట్ అక్కడక్కడా నవ్వులు పంచిన సినిమా, సెకండ్ హాఫ్‌లో నెమ్మదిగా సాగుతూ ఆసక్తిని కోల్పోతుంది. ముఖ్యంగా ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్ ఐశ్వర్య రాజేష్, తిరువీర్ అని చెప్పుకోక తప్పదు. కథనంలో అక్కడక్కడా లోపాలు ఉన్నప్పటికీ, తమ నటనతో సినిమాను వీలైనంత వరకు నిలబెట్టడానికి వీరు ప్రయత్నించారు. సెకండ్ హాఫ్‌లో వీరిద్దరి కాంబినేషన్ సీన్స్ ఆడియన్స్ని అలరిస్తాయి.
ఓవరాల్గా ‘ఓ..! సుకుమారి’ కాన్సెప్ట్ బాగుంది.. కానీ క్లారిటీ మిస్సైంది. దామినిని ముట్టుకుంటే షాక్ కొడుతుందనే కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్గా ఉన్నా, అది ఎప్పుడు పనిచేస్తుంది? ఎప్పుడు పనిచేయదు? అనే విషయాన్ని సినిమాలో క్లారిటీగా చెప్పలేకపోయాడు డైరెక్టర్. ఈ లాజిక్‌ను మరింత క్లియర్‌గా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే, కథపై ప్రేక్షకులకు ఇంకా మంచి కనెక్ట్ ఏర్పడేది.
నటీనటుల పెర్ఫార్మన్స్..
యాదగిరి పాత్రలో తిరువీర్ మరోసారి తన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా శోభనం ఎపిసోడ్‌లో ఆయన ఎక్స్‌ప్రెషన్స్ మంచి నవ్వులు పంచుతాయి. టాలెంటెడ్ నటి ఐశ్వర్య రాజేష్ ఎప్పటిలాగే దామిని పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచింది. పాత్రలో ఉన్న ఆందోళనను, ధైర్యాన్ని చక్కగా పండించింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్, కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరిస్తాయి. మిగతా నటీనటులు పర్వాలేదు.
టెక్నీకల్ అంశాలు..
డైరెక్టర్ భరత్ దర్శన్ ఒక ఇంట్రెస్టింగ్ లైన్ తీసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. పేపర్ పైన తన రైటింగ్కి మంచి పనిపెట్టారు. కానీ, తెరపైకి తీసుకురావడంలో మాత్రం తడబడ్డాడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఐడియాను మరింత ఎంగేజింగ్ స్క్రీన్‌ప్లేతో చెప్పి ఉంటే ఫలితం మరోలా ఉండేది. ఇక చి. కుషేందర్ కెమెరా పనితనం పర్వాలేదనిపిస్తుంది. భరత్ మంచిరాజు అందించిన సంగీతం అంతగా గుర్తుంచుకునేలా లేదు, పాటలు అంతగా రిజిస్టర్ కావు. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్‌గా ఉండి ఉంటే సినిమా కాస్త వేగంగా సాగేది. గంగా ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా బాగున్నాయి.
