ఆరో తరగతి చదువుతున్న రంజిత్ కు చదువంటే ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కానీ, బొమ్మలు గీయడం అంటే ఎంతో ఇష్టం. రోజు బడికి రాకుండా ఇంటి దగ్గర ఉన్న చింత చెట్ల కింద, పిల్లలతో ఆటలు ఆడుకునేవాడు. పక్కనే ఉన్న చెరువులో చేపలు పడుతూ టైంపాస్ చేసేవాడు. తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినేవాడు కాదు.
ఒకసారి రంజిత్ ను వాళ్ళ అమ్మ బడికి తీసుకెళ్లింది. రంజిత్ రోజు చేసే పనుల గురించి టీచర్ కు చెప్పింది. ఆయన గట్టిగానే రంజిత్ ను మందలించాడు. 'ఇకపై అలా చేయను.. రోజూ బడికి వస్తాను' అని టీచర్ తో చెప్పాడు. ఆ మరుసటి రోజు నుండి రంజిత్ బడికి వెళ్లడం స్టార్ట్ చేశాడు. కానీ అటు ఇటు తిరుగుతూ తోటి పిల్లలను ఇబ్బంది పెట్టేవాడు. ఇది చూసిన టీచర్ ఎలాగైనా రంజిత్ లో మార్పు తీసుకురావాలి అనుకున్నాడు. అంతలోనే బాలల దినోత్సవం వచ్చింది. ఆ సందర్భంగా మండల స్థాయిలో డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తున్నారనీ, ఇందులో పాల్గొనే పిల్లలు పేర్లను ఇవ్వాలని టీచర్ అడిగారు. 'ఫస్ట్ ప్రైజ్ కి వెయ్యి. సెకండ్ ప్రైజ్ కి ఆయిదువందల రూపాయలు ఇస్తారు' అని చెప్పారు టీచర్.
లంచ్ తర్వాత రంజిత్... టీచర్ దగ్గరకు వచ్చాడు. తన దగ్గరున్న నోట్ బుక్ టీచరుకి చూపించాడు. అందులో అందమైన డ్రాయింగ్స్ ఉన్నాయి. అవన్నీ తానే వేశానని రంజిత్ చెప్పాడు. వాటిని చూసిన టీచర్ ఎంతో ఆనందించాడు. 'డ్రాయింగ్ పోటీలకు నీ పేరు పంపిస్తాను. నీకు తప్పకుండా ప్రైజ్ వస్తుంది' అని చెప్పాడు. చాలా సంతోషించాడు రంజిత్. ఎలా అయినా పోటీల్లో ప్రైజ్ తెచ్చుకోవాలని మరిన్ని డ్రాయింగ్స్ బాగా ప్రాక్టీస్ చేశాడు రంజిత్. అనుకున్నట్టుగానే ఆ పోటీల్లో రంజిత్ కు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఎగిరి గంతులు వేశాడు రంజిత్. ఎంఈఓ చేతుల మీదుగా ప్రైజ్ మనీ అందుకున్నాడు. ఇది రంజిత్ లో చాలా ఉత్సాహాన్ని నింపింది. తనను ప్రోత్సహించిన టీచర్ కి థ్యాంక్స్ చెప్పాడు. 'ఇకపై ప్రతిరోజు వస్తాను. శ్రద్ధగా పాఠాలు విని మంచివాడిగా మారతానని' టీచర్ తో అన్నాడు రంజిత్. రంజిత్ లో వచ్చిన మార్పుకు సంతోషించాడు టీచర్.
ALSO READ : తిన్న తర్వాతే కాదు.. రోగాలకూ కూడా చెక్ పెట్టే సోంపులో దాగున్న హెల్త్ సీక్రెట్స్ ఇవే!
-యాడవరం చంద్రకాంత్ గౌడ్.
