ఆస్ట్రేలియా చారిత్రాత్మక నిర్ణయం.. ఇల్లు కొనుక్కునే కార్మికులకు అదనపు రాయితీలు

ఆస్ట్రేలియా చారిత్రాత్మక నిర్ణయం.. ఇల్లు కొనుక్కునే కార్మికులకు అదనపు రాయితీలు

ఆస్ట్రేలియా ప్రభుత్వం హౌసింగ్ సంక్షోభానికి అడ్డుకట్ట వేసేందుకు, సామాన్యులకు ఇళ్లను అందుబాటులోకి తెచ్చేందుకు చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దశాబ్దాల కాలంలోనే అతిపెద్ద పన్ను సంస్కరణలకు శ్రీకారం చుడుతూ ఆ దేశ పార్లమెంట్ గురువారం ఒక కీలక బిల్లును ఆమోదించింది. ప్రాపర్టీ ఇన్వెస్టర్లకు ఇప్పటివరకు లభిస్తున్న పన్ను రాయితీలను భారీగా తగ్గించడం, అలాగే క్యాపిటల్ గెయిన్స్ డిస్కౌంట్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం.

ఈ కొత్త బిల్లు ప్రకారం.. ఏడాది కంటే ఎక్కువ కాలం పాటు ఆస్తులను దగ్గర ఉంచుకుంటే లభించే 50 శాతం క్యాపిటల్ గెయిన్స్ డిస్కౌంట్ స్థానంలో.. ఇకపై ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సర్దుబాటు చేసిన లాభాలపై పన్నును మాత్రమే విధిస్తారు. దీనితో పాటు జూలై 2027 నుంచి నెట్ క్యాపిటల్ గెయిన్స్ లాభాలపై కనీసం 30 శాతం పన్ను అమల్లోకి రానుంది. అలాగే ఇన్వెస్టర్లు తమ ఆస్తి నష్టాలను పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయంతో భర్తీ చేసుకునే 'నెగటివ్ గేరింగ్' నిబంధనను ఇకపై కేవలం కొత్తగా నిర్మించే ఇళ్లకు మాత్రమే పరిమితం చేయనున్నారు. దీనివల్ల పెట్టుబడులు కొత్త గృహ నిర్మాణ రంగం వైపు మళ్లుతాయని ఆస్ట్రేలియా ప్రభుత్వం భావిస్తోంది.

ప్రతిపక్షాలు, కొందరు స్వతంత్ర సభ్యులు ప్రతిపాదించిన సవరణలు విఫలం కావడంతో.. ఈ బిల్లు దిగువ సభలో 94-48 ఓట్ల భారీ మెజారిటీతో నెగ్గింది. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ ఎక్స్ లో స్పందిస్తూ.. ప్రతి కార్మికుడికి పన్ను కోతలతో పాటు, మొదటిసారి ఇల్లు కొనుక్కునే వారికి ఈ బిల్లు ద్వారా సమానమైన అవకాశం లభిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఈ పన్ను మార్పులను కేవలం రియల్ ఎస్టేట్‌కే పరిమితం చేయాలని, తమ వ్యాపారాలకు మినహాయింపు ఇవ్వాలని కొన్ని వ్యాపార సంస్థలు ప్రభుత్వాన్ని కోరాయి.

పార్లమెంట్ ఆమోదం పొందిన ఈ బిల్లు ఇప్పుడు సెనెట్‌కు వెళ్లనుంది. అక్కడ ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో క్రాస్‌బెంచ్ సభ్యుల మద్దతు అవసరం కానుంది. ఈ బిల్లు ద్వారా ఇళ్ల ధరలను నియంత్రించడమే కాకుండా, కార్మికులకు వెంటనే 250 ఆస్ట్రేలియన్ డాలర్ల మదింపుతో పాటు కొత్తగా వెయ్యి ఆస్ట్రేలియన్ డాలర్ల టాక్స్ డిడక్షన్ కల్పించారు. ఇది ఇప్పటికే అమలులో ఉన్న పన్ను కోతలకు అదనం కావడంతో ప్రజలు కూడా దీనిని స్వాగతిస్తున్నారు.