డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రోజురోజుకూ క్షీణిస్తుండటం, దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు భారీగా తరలిపోతుండటంతో ఆలస్యంగానైనా మోడీ ప్రభుత్వం కళ్లుతెరిచింది. ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులకు పన్నుల పరంగా భారీ ఊరటనిచ్చేలా కేంద్ర మంత్రివర్గం ఒక కీలక ఆర్డినెన్స్‌ను ప్రతిపాదించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ తీసుకొచ్చిన ఈ ప్రతిపాదన వివరాలు పూర్తిగా బయటకు రానప్పటికీ.. విదేశీ పెట్టుబడులను మళ్లీ దేశంలోకి ఆకర్షించడమే దీని ప్రధాన లక్ష్యమని తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఈ నిర్ణయం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ ఏడాది జనవరి నుంచి విదేశీ ఇన్వెస్టర్లు భారతీయ ఈక్విటీల నుంచి రికార్డు స్థాయిలో రూ.2లక్షల 25వేల కోట్లను వెనక్కి తీసుకున్నారు. దీనికి తోడు అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఏకంగా 6 శాతం పడిపోయింది. దీంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ రెండు సవాళ్లను ఎదుర్కొని.. మార్కెట్‌లో స్థిరత్వం తీసుకురావడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి ప్రభుత్వం ఒక సమన్వయ వ్యూహాన్ని అమలు చేస్తోంది. బుధవారం ప్రారంభమైన మానిటరీ పాలసీ కమిటీ సమావేశం అనంతరం, ఆర్‌బీఐ గవర్నర్ శుక్రవారం రోజున మరికొన్ని కీలక చర్యలను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
గతంలో ప్రభుత్వ సెక్యూరిటీలు, రాష్ట్ర అభివృద్ధి రుణాలు, రూపాయి బాండ్లపై వచ్చే వడ్డీ ఆదాయంపై విత్ హోల్డింగ్ పన్ను కేవలం 5 శాతంగా ఉండేది. అయితే జూలై 1, 2023 నుండి ప్రభుత్వం దీనిని 20 శాతానికి పెంచింది. ఈ భారీ పెంపుతో పాటు క్యాపిటల్ గెయిన్స్ టాక్స్, సెక్యూరిటీల లావాదేవీల పన్ను (STT) రెండింటినీ కలిపి వసూలు చేస్తుండటంతో భారతదేశంలో పెట్టుబడులు పెట్టడం విదేశీయులకు భారంగా మారింది. ఈ నేపథ్యంలోనే బడ్జెట్ కంటే ముందే విదేశీ ఇన్వెస్టర్లు పన్నుల విధానాన్ని పునఃసమీక్షించాలని కోరారు.
మరోవైపు పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం కూడా భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ ఒత్తిళ్ల నుండి దేశాన్ని రక్షించడానికి ప్రభుత్వం ఇప్పటికే వ్యాపారాలకు ప్రభుత్వ గ్యారెంటీతో కూడిన క్రెడిట్ లైన్, ఎగుమతిదారులకు ప్రత్యేక ప్యాకేజీ, ఇంధన సుంకాల్లో సర్దుబాట్లు వంటి చర్యలను చేపట్టింది. ప్రస్తుతం ప్రతిపాదించిన ఈ కొత్త ఆర్డినెన్స్ రూపాయి పతనాన్ని అడ్డుకోవడమే కాకుండా.. అంతర్జాతీయ మార్కెట్లలో భారత మార్కెట్లను మళ్లీ ఆకర్షనీయమైన పెట్టుబడి డెస్టినేషన్ గా మార్చుతుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే వీటితో ఫలితం ఎంత స్థాయిలో ఉంటుందో వేచి చూడాల్సిందే మరి.
