వరంగల్ జిల్లాలో గుట్కా అమ్మొద్దు..సిగరెట్ దొరకొద్దు!

వరంగల్ జిల్లాలో గుట్కా అమ్మొద్దు..సిగరెట్ దొరకొద్దు!
  •     స్కూళ్లు, కాలేజీల సమీపంలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై వంద మీటర్ల వరకు నిషేధం
  •     స్టూడెంట్స్ చెడు దారి పట్టకుండా చర్యలు
  •     'ఆపరేషన్ సేఫ్ స్కూల్' పేరుతో తనిఖీలు
  •     వరంగల్ కమిషనరేట్ లో ఇప్పటికే 411కుపైగా కేసులు
  •     స్కూల్స్ రీఓపెనింగ్ నాటికి 'టొబాకో ఫ్రీ జోన్లు'గా మార్చేలా యాక్షన్

హనుమకొండ, వెలుగు:  మరో పది రోజుల్లో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు రీఓపెనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సిద్ధమవుతున్నాయి. అయితే, స్కూళ్లు, కాలేజీల పరిసరాల్లోని పాన్ షాపులు, ఇతర దుకాణాలు స్టూడెంట్లను చెడు అలవాట్ల వైపు మళ్లిస్తున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గుట్కా, సిగరెట్లు తదితర పొగాకు ఉత్పత్తులను విక్రయించడం ద్వారా విద్యార్థులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వరంగల్ కమిషనరేట్ పరిధిలో ‘ఆపరేషన్ సేఫ్ స్కూల్’ పేరుతో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. మైనర్లు, స్కూల్​ స్టూడెంట్లకు గుట్కా, సిగరెట్లు వంటి పొగాకు ఉత్పత్తులు అమ్మకుండా విద్యాసంస్థల సమీపంలోని పాన్ షాపులు, ఇతర దుకాణాలను తనిఖీ చేస్తున్నారు. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే నాటికి స్కూళ్లు, కాలేజీల పరిసరాలను టొబాకో-ఫ్రీ జోన్లుగా మార్చేందుకు యాక్షన్​ తీసుకుంటున్నారు. 

స్కూళ్లు, కాలేజీల చుట్టే పాన్ డబ్బాలు..

వరంగల్ నగరంలోని ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్, డిగ్రీ కాలేజీల చుట్టూ కిరాణ షాపులు, పాన్ డబ్బాలు వెలిశాయి. ముఖ్యంగా హనుమకొండలో ఉన్న గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, డీఈవో ఆఫీస్ సమీపంలోని ప్రభుత్వ హై స్కూల్, మర్కజీ స్కూల్, వరంగల్ లో ఏవీవీ జూనియర్ కాలేజీ.. ఇలా ప్రతిచోటా మైనర్లు, స్టూడెంట్లను టార్గెట్ చేసుకునే పాన్ షాపులు పుట్టుకొచ్చాయి. శ్రీచైతన్య, ఎస్ఆర్, ఇతర ప్రైవేటు విద్యాసంస్థల వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఆయా విద్యాసంస్థలకు వచ్చే స్టూడెంట్స్ సోంపు నుంచి గుట్కాలు, పాన్ బాహర్, పాన్ మసాలా, అంబార్ లాంటి పొగాకు ఉత్పత్తులకు అలవాటు పడుతున్నారు. 

ఎంజాయ్ పేరున సిగరేట్ కాల్చడం కూడా స్టార్ట్ చేస్తున్నారు. వాస్తవానికి చట్టప్రకారం పొగాకు ఉత్పత్తులు స్కూల్ స్టూడెంట్లు, మైనర్లకు విక్రయించడం నేరం. అయినా దానిని పట్టించుకోకుండా 18 ఏండ్లలోపు పిల్లలకు కూడా గుట్కాలు, బీడీలు, సిగరెట్లు, ఇతర పొగాకు పదార్థాలు అమ్ముతుండటం గమనార్హం. ఇలా గుట్కా, సిగరేట్ నుంచి మెల్లిగా గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు అలవాటుపడుతున్న పిల్లలు.. చెడు వ్యసనాల బారినపడుతున్నారు.

ఆపరేషన్ సేఫ్ స్కూల్ తో చెక్..

ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు చెందిన స్టూడెంట్స్ గుట్కా, సిగరేట్, అంబార్, తదితర పొగాకు ప్రొడక్ట్స్ అలవాటు పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమయ్యేలోగా స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లు, ఇతర విద్యాసంస్థలకు వంద మీటర్ల దూరంలో గుట్కా, సిగరేట్, పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై నిషేధం విధించింది. ఈ మేరకు 'ఆపరేషన్ సేఫ్ స్కూల్' పేరుతో విద్యాసంస్థల సమీపంలోని పాన్ షాపులు, దుకాణాల్లో తనిఖీలు నిర్వహించాల్సిందిగా జిల్లా అధికారులకు ఆదేశాలిచ్చింది. దీంతో వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు కమిషనరేట్ పరిధిలోని స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థలకు వంద మీటర్లలోపు దూరంలో ఉన్న పాన్ డబ్బాలు, కిరాణం పాపుల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. 

411కుపైగా కేసులు...

ఆపరేషన్ సేఫ్ స్కూల్ కార్యక్రమంలో భాగంగా వరంగల్ కమిషనరేట్ పోలీసులు ప్రతి స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల జాబితా ప్రకారం తనిఖీలు చేపడుతున్నారు. హనుమకొండలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ, మర్కజీ స్కూల్, జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం హాస్టల్స్, అదాలత్ జంక్షన్ లోని గవర్నమెంట్ స్కూల్స్.. ఇలా ప్రతి స్టేషన్ పరిధిలో స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో చాలాచోట్ల 12 నుంచి 14 ఏండ్లలోపు పిల్లలకు కూడా సిగరెట్లు అమ్ముతున్నట్లు గుర్తించారు. 

ఈ మేరకు 411కుపైగా పాన్ షాపులు, దుకాణాల యజమానులపై సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్-2003తో పాటు జువైనల్ జస్టిస్ యాక్ట్-2015 సెక్షన్-77 ప్రకారం కేసులు నమోదు చేశారు. ఇందులో అత్యధికంగా వరంగల్ సెంట్రల్ జోన్ పరిధిలో 236, ఈస్ట్ జోన్ లో 104, వెస్ట్ జోన్ లో 71 కేసులుండటం గమనార్హం. కాగా, మైనర్లు, స్కూల్ స్టూడెంట్లకు పొగాకు ఉత్పత్తులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఏడేండ్ల జైలు శిక్షతో పాటు రూ.లక్ష వరకు జరిమానా విధించే అవకాశం ఉందని పోలీస్ అధికారులు హెచ్చరిస్తున్నారు.

స్కూళ్ల వద్ద పొగాకు ప్రొడక్ట్స్ అమ్మితే చర్యలు.. 

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆపరేషన్ సేఫ్ స్కూల్ పేరుతో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాం. స్కూళ్లు, కాలేజీ, ఇతర విద్యాసంస్థల వద్ద పొగాకు ప్రొడక్ట్స్ అమ్మకుండా చర్యలు తీసుకుంటున్నాం. సంబంధిత షాప్ యజమానులపై కేసులు నమోదు చేస్తున్నాం. మైనర్లకు పొగాకు ఉత్పత్తులు అమ్మితే సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. విద్యాసంస్థల వద్ద ఎక్కడైనా గుట్కా, సిగరెట్ అమ్మితే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

- సన్ ప్రీత్ సింగ్, పోలీస్ కమిషనర్, వరంగల్