అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జనరిక్ ఔషధాల దిగుమతులపై కొత్త టారిఫ్ విధానాన్ని ప్రకటించారు. ఈ నిర్ణయం ప్రకారం 2026 ఆగస్టు 1 నుంచి వచ్చే రెండేళ్ల పాటు జనరిక్ మందులపై ఎలాంటి టారిఫ్ ఉండదు. అయితే 2028 ఆగస్టు నుంచి ఏడాది పాటు 100 శాతం టారిఫ్, 2029 ఆగస్టు నుంచి 200 శాతం టారిఫ్ అమలులోకి రానుంది. ఈ 2 సంవత్సరాల వ్యవధిలో అమెరికాలోనే తయారీ యూనిట్లు ఏర్పాటు చేయని కంపెనీలపై ఈ సుంకాల ఎఫెక్ట్ పడనుంది. పేటెంట్, బ్రాండెడ్, ఇన్నోవేటివ్ ఔషధాలపై ప్రస్తుతం అమలులో ఉన్న విధానం మాత్రం యథాతథంగా కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు.
అమెరికా లక్ష్యం ఇదే..
ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశం అమెరికాలో ఔషధ తయారీని పెంచడం. ప్రస్తుతం తక్కువ ఉత్పత్తి వ్యయం కారణంగా భారత్, చైనా వంటి దేశాల నుంచి అమెరికా భారీగా జనరిక్ మందులను దిగుమతి చేసుకుంటోంది. ఇకపై విదేశీ కంపెనీలు అమెరికాలో ప్లాంట్లు ఏర్పాటు చేసి స్థానికంగా ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతోనే ఈ టారిఫ్ విధానాన్ని తీసుకొచ్చినట్లు ట్రంప్ వెల్లడించారు. నిర్ణీత గడువులోగా అమెరికాలో ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటు చేయని సంస్థలకు భారీ సుంకాలు విధిస్తామని స్పష్టం చేశారు.
భారత్ ఫార్మా రంగానికి ఎందుకు కీలకం?
అమెరికాకు జనరిక్ ఔషధాల అతిపెద్ద సరఫరాదారు భారత్. 2025లో అమెరికాకు 9.7 బిలియన్ డాలర్ల విలువైన ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులను ఎగుమతి చేసింది ఇండియా. ఇది దేశ మొత్తం ఫార్మా ఎగుమతుల్లో దాదాపు 38 శాతం రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్, అంటువ్యాధులు, మానసిక ఆరోగ్య సమస్యలకు సంబంధించిన జనరిక్ మందులను భారత్ పెద్దఎత్తున అమెరికాకు సరఫరా చేస్తోంది. అందుకే భారత ఫార్మా పరిశ్రమను ప్రపంచ ఫార్మసీగా పిలుస్తారు.
అమెరికాలో జనరిక్ మందుల ప్రాధాన్యం..
అమెరికాలో ఉపయోగించే జనరిక్ ప్రిస్క్రిప్షన్లలో దాదాపు 90 శాతం దిగుమతుల ద్వారానే అందుతున్నాయి. వాటిలో భారత కంపెనీల వాటా అత్యధికం. తక్కువ తయారీ వ్యయం కారణంగా భారత జనరిక్ మందులు అమెరికా ఆరోగ్య వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. భారత్‌లో తయారీ ఖర్చు అమెరికాతో పోలిస్తే 40 నుంచి 60 శాతం వరకు తక్కువగా ఉండటంతో అమెరికా సంస్థలు భారత ఉత్పత్తులను ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాయి.
భారత్ కంపెనీలకు ఎలాంటి ప్రభావం?
ప్రస్తుతం రెండేళ్ల పాటు టారిఫ్స్ లేకపోవడంతో తక్షణ ప్రభావం ఉండదు. అయితే 2028 తర్వాత 100 శాతం, 2029 నుంచి 200 శాతం టారిఫ్ అమల్లోకి వస్తే భారత కంపెనీల ముందు 3 మార్గాలు మాత్రమే ఉంటాయి. అమెరికాలో కొత్త తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేయడం, అదనపు టారిఫ్ భారాన్ని భరించడం లేదా ఆ ఖర్చును వినియోగదారులపై మోపడం. ఇప్పటికే అమెరికాలో అనుబంధ సంస్థలు ఉన్న భారత కంపెనీలు తమ తయారీ సామర్థ్యాన్ని పెంచే అవకాశాలు ఉన్నాయి.
కుదేలైన ఫార్మా షేర్లు..
ట్రంప్ ప్రకటన బయటకు వచ్చిన వెంటనే భారత స్టాక్ మార్కెట్‌లో ఫార్మా షేర్లపై అమ్మకాల ఒత్తిడి పెరిగింది. నిఫ్టీ ఫార్మా సూచీ దాదాపు 2 శాతం క్షీణించింది. సన్ ఫార్మా, సిప్లా, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు 1 నుంచి 2 శాతం వరకు పడిపోయాయి. గ్లాండ్ ఫార్మా, పిరమల్ ఫార్మా, అజంతా ఫార్మా, గ్లెన్‌మార్క్ వంటి మిడ్, స్మాల్‌క్యాప్ ఫార్మా కంపెనీల షేర్లు 2 నుంచి 3 శాతం వరకు నష్టపోయాయి. భవిష్యత్‌లో అమెరికా మార్కెట్ నుంచి వచ్చే ఆదాయంపై ప్రభావం పడొచ్చన్న ఆందోళనతో ఇన్వెస్టర్లు అలర్ట్ అయ్యారు.
ALSO READ : వరుసగా మూడోరోజూ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. అసలు ఏం జరుగుతోంది?
ముందున్న సవాల్.. అవకాశంగా మార్చుకుంటాయా?
ఈ నిర్ణయం భారత ఫార్మా ఇండస్ట్రీని వెంటనే ఎదురుదెబ్బ కాకపోయినా.. దీర్ఘకాలంలో కీలక సవాల్‌గా మారే అవకాశం ఉంది. అమెరికా మార్కెట్‌పై అధికంగా ఆధారపడిన భారత కంపెనీలు వచ్చే రెండేళ్లలో వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అమెరికాలో తయారీని విస్తరించడం, సరఫరా గొలుసును మార్చడం, వ్యాపార నమూనాను పునర్వ్యవస్థీకరించడం ద్వారా మాత్రమే భవిష్యత్ టారిఫ్ ప్రభావాన్ని తట్టుకుని ముందుకెళ్లగలవని నిపుణులు అంటున్నారు.
