ఈ దేశంలో ప్రజల పక్షం.. సామాన్యుల పక్షం.. పేదల పక్షం ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని.. బ్రిటీషోళ్లను దేశం నుంచి తరిమికొట్టిన పార్టీ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలాంటిది బ్రిటీషన్ జనతా పార్టీ అయిన బీజేపీకి భయపడేది లేదని.. లాఠీఛార్జీలకు, తుపాకులకు భయపడం అంటూ బీజేపీకి వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.
విద్యార్థులకు మద్దతుగా ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చేపట్టిన నిరసనపై పోలీసుల వైఖరిని తప్పుబట్టారు సీఎం రేవంత్. ప్రధాని మోదీ, విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేసి తీరాలని.. రాహుల్ గాంధీపై వ్యవహరించిన తీరును దేశం అంతా చూసిందని.. దుర్మార్గమైన బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
నీట్ పేపర్ లీక్ పై ఇంత వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించిన సీఎం రేవంత్.. కోట్ల మంది విద్యార్థులు ఆందోళన చేస్తుంటే.. నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించటం ఏంటని ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని నిలదీశారాయన.
ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టుకు నిరసనగా కొడంగల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ తర్వాత అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నాలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్ర ప్రభుత్వం వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. దేశానికి ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ నిరసన చేపడితే.. బలవంతంగా అరెస్ట్ చేయటంతోపాటు.. పోలీసులు దురుసుగా వ్యవహరించటాన్ని తప్పుబట్టారు సీఎం రేవంత్ రెడ్డి.
ALSO READ : రాహుల్ గాంధీ అరెస్ట్ను ఖండిస్తూ కొడంగల్లో సీఎం రేవంత్ నిరసన ర్యాలీ
బ్రిటీషోళ్లను తరిమికొట్టి.. దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ అయితే.. బ్రిటీష్ జనతా పార్టీగా బీజేపీ.. దేశంలోని ప్రజలపై దాడులు చేస్తూ.. వాళ్లను దోచుకుంటుందంటూ తీవ్రంగా మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి.
