కొడంగల్: కొడంగల్లో సీఎం రేవంత్ తన నివాసం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు కాంగ్రెస్ శ్రేణులతో ర్యాలీగా బయలుదేరారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ర్యాలీ, ధర్నా చేశారు. రాహుల్ గాంధీ అరెస్ట్ను సీఎం రేవంత్ రెడ్డి ఖండించారు. కొడంగల్ అంబేద్కర్ సర్కిల్లో సీఎం నిరసన వ్యక్తం చేశారు. సీఎం ర్యాలీకి కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ, ఇతర నేతల అక్రమ అరెస్ట్ను సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే ప్రాథమిక హక్కులపై కేంద్రం చేస్తున్న ప్రత్యక్ష దాడి ఇది అని సీఎం రేవంత్ మంగళవారం కూడా ఎక్స్ వేదికగా స్పందించిన సంగతి తెలిసిందే.
కేంద్ర ప్రభుత్వం యువత భవిష్యత్తుతో ఆడుకుంటున్నదని, వారి న్యాయమైన డిమాండ్లకు మద్దతుగా, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రాహుల్, ప్రియాంక, ఇతర నేతల అరెస్టు అప్రజాస్వామికమని అన్నారు. వారిని జైలుకు పంపినా, అణచివేత చర్యలకు పాల్పడినా న్యాయం, జవాబుదారి తనం కోసం పోరాడుతున్న మిలియన్ల మంది భారతీయ యువత ఆక్రోశాన్ని, నిరసన గళాన్ని కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం అణచివేయలేదని సీఎం స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వ పక్షపాత వైఖరికి వ్యతిరేకంగా పోరాడుతున్న యువతకు, విద్యార్థులకు యావత్ కాంగ్రెస్ పార్టీతో పాటు దేశ ప్రజలందరూ అండగా ఉంటారని ఎక్స్ లో సీఎం పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఎటువంటి వేధింపులకైనా బెదిరేది లేదని స్పష్టం చేశారు.
