భారత ఏవియేషన్‌లో బిగ్ ఛేంజ్.. అదానీ, GMR ఎంట్రీకి మోడీ సర్కార్ గ్రీన్ సిగ్నల్?

భారత ఏవియేషన్‌లో బిగ్ ఛేంజ్.. అదానీ, GMR ఎంట్రీకి మోడీ సర్కార్ గ్రీన్ సిగ్నల్?

భారత విమానయాన రంగంలో మరో కీలక మార్పుకు మోడీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు ఎయిర్‌పోర్టులను నిర్వహించే సంస్థలు.. విమానయాన సేవలను నడపడానికి ఉన్న పరిమితులను సడలించే దిశగా బీజేపీ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే దేశంలోని అతిపెద్ద ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్లైన అదానీ గ్రూప్, జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ వంటి సంస్థలు భవిష్యత్తులో సొంతంగా విమాన సేవలను ప్రారంభించే అవకాశం ఏర్పడుతుంది. దీంతో భారత ఏవియేషన్ రంగంలో పోటీ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఉన్న నిబంధన ఏంటి?
ప్రస్తుతం ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన విమానాశ్రయాలను నిర్వహిస్తున్న సంస్థలు ఏదైనా ఎయిర్‌లైన్‌లో 10 శాతానికి మించి వాటా కలిగి ఉండేందుకు అనుమతి లేదు. ఈ రూల్ వల్ల ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్లు నేరుగా ఎయిర్‌లైన్ వ్యాపారంలోకి రావడం సాధ్యం కావడం లేదు. ఇప్పుడు ఈ పరిమితిని తొలగించే ప్రతిపాదనపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ చర్చలు జరుపుతోంది. దీనికి న్యాయశాఖ, అనంతరం కేంద్ర మంత్రివర్గం ఆమోదం అవసరం.

అదానీ, జీఎంఆర్‌కు భారీ అవకాశం..
కొత్త విధానం అమల్లోకి వస్తే ముంబైతో పాటు మరో 7 ఎయిర్ పోర్ట్స్ నిర్వహిస్తున్న అదానీ గ్రూప్, ఢిల్లీతో పాటు మరో 4 ఎయిర్‌పోర్టులను నిర్వహిస్తున్న జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ సొంతంగా ఎయిర్‌లైన్ సేవలను ప్రారంభించే అవకాశాన్ని పొందుతాయి. దీంతో ఎయిర్‌పోర్ట్ నిర్వహణతో పాటు విమాన సర్వీసులు కూడా ఒకే సంస్థ ఆధ్వర్యంలో ఉండే పరిస్థితి ఏర్పడుతుంది.

ఎందుకు ఈ నిర్ణయం?
దేశీయ విమానయాన రంగంలో ప్రస్తుతం ఇండిగో, ఎయిర్ ఇండియా కలిసి దాదాపు 90 శాతం మార్కెట్‌ను నియంత్రిస్తున్నాయి. గత 10 ఏళ్లలో జెట్ ఎయిర్‌వేస్, గో ఫస్ట్ వంటి సంస్థలు మూతపడగా.. విస్తారా, ఎయిర్ ఏషియా ఇండియా టాటా గ్రూప్‌లో విలీనమయ్యాయి. దీంతో పోటీ తగ్గిపోయింది. ఈ పరిస్థితిని మార్చి కొత్త సంస్థలను ప్రోత్సహించడం, ప్రయాణికులకు మరిన్ని ఆప్షన్స్ కల్పించడమే కేంద్రం లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే ఈ ప్రతిపాదనపై కొన్ని సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎయిర్‌పోర్ట్‌ను నిర్వహించే సంస్థ తన సొంత ఎయిర్‌లైన్‌కు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా విమానాల టేకాఫ్, ల్యాండింగ్‌కు కీలకమైన స్లాట్‌ల కేటాయింపులో పక్షపాతం జరిగే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ALSO READ : ట్రంప్ 200% టారిఫ్స్ ప్లాన్.. భారత ఫార్మా కంపెనీల్లో అల్లకల్లోలం..

2047 నాటికి భారీ విస్తరణ లక్ష్యం..
భారత్ 2047 నాటికి దేశంలోని ఎయిర్ పోర్ట్స్ సంఖ్యను 350కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే 2044 నాటికి మరో 42.5 కోట్ల కొత్త ప్రయాణికులు విమాన సర్వీసులను వినియోగించే అవకాశం ఉందని అంచనా. ఈ నేపథ్యంలో విమానయాన రంగంలో కొత్త కంపెనీల ప్రవేశానికి అవకాశం కల్పించడం ద్వారా పోటీ, సేవల నాణ్యత, ప్రయాణికుల ఎంపికలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి మోడీ సర్కార్ తీసుకోబోయే నిర్ణయాలు కొత్త కంపెనీల రాకకు, పోటీతత్వం పెరిగేందుకు ఎంత వరకూ దోహదపడుతుంది అన్నది.