- అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు స్వదేశంలో ఎదురుదెబ్బ.. ఇది దేశభక్తి లేని చర్య అంటూ ట్రంప్ ఫైర్
- తీర్మానం సెనేట్ ఆమోదం పొందినా.. వీటోతో ప్రెసిడెంట్ రద్దు చేసేందుకు చాన్స్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఆ దేశ ప్రతినిధుల సభలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్పై సైనిక చర్యను నిలిపివేసే తీర్మానానికి బుధవారం సభ ఆమోదం తెలిపింది. ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించాలని.. ఆ యుద్ధం నుంచి అమెరికా దళాలను వెంటనే ఉపసంహరించుకోవాలని అమెరికా ప్రతినిధుల సభ కీలక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానం 215 – -208 ఓట్ల తేడాతో నెగ్గింది. ట్రంప్ సొంత పార్టీ(రిపబ్లికన్)కి చెందిన నలుగురు సభ్యులు కూడా డెమోక్రాట్లతో కలిసి ఈ తీర్మానానికి మద్దతు తెలపడం విశేషం. అయితే, సెనేట్ ఆమోదం పొందినా.. అధ్యక్షుడు ట్రంప్ ఈ తీర్మానాన్ని తన వీటో అధికారంతో తిరస్కరించే అవకాశం ఉంది. మరోవైపు ఇది డొనాల్డ్ ట్రంప్‌కు అమెరికా ప్రజల తరఫున అందుతున్న స్పష్టమైన సందేశమని డెమోక్రాట్లు పేర్కొంటున్నారు.
ఇరాన్‌లో ఆయన చేస్తున్న అక్రమ యుద్ధాన్ని ముగించాల్సిన సమయం వచ్చిందని ప్రతినిధుల సభ విదేశీ వ్యవహారాల కమిటీ పేర్కొంది. కాంగ్రెస్ అనుమతి లేకుండానే ఫిబ్రవరిలో ఇరాన్‌పై దాడులు చేయడం ద్వారా ట్రంప్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని డెమోక్రాట్లు ఆరోపిస్తున్నారు.వార్ పవర్స్ యాక్ట్ ప్రకారం.. యుద్ధం ప్రారంభించిన 60 రోజుల్లోపు కాంగ్రెస్ ఆమోదం పొందాలి. ఆ గడువు ఎప్పుడో ముగిసిపోయిందని, ప్రస్తుతం ట్రంప్ చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారని వారు వాదిస్తున్నారు.
అయితే, ఏప్రిల్‌లో జరిగిన కాల్పుల విరమణ వల్ల ఆ సమయం(గడువు) ఆగిపోయిందని వైట్ హౌస్ వాదిస్తోంది. కానీ, ప్రస్తుతం యుద్ధం ముగిసిందని ట్రంప్ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం రాత్రి కూడా ఇరాన్ డ్రోన్లను అమెరికా కూల్చివేసింది. ప్రతిగా ఇరాన్ తన పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలపై క్షిపణులతో దాడులు చేసింది. ఏదేమైనా ఇరాన్ యుద్ధాన్ని ముగించాలని అమెరికా ప్రతినిధుల సభ తీర్మానం చేయడం అధ్యక్షుడు ట్రంప్‌కు రాజకీయంగా గట్టి దెబ్బ తగిలినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ తీర్మానం ఇప్పుడు సెనేట్‌కు వెళ్తుంది. అక్కడ ఆమోదం లభిస్తే.. ఆ తర్వాత ట్రంప్ వద్దకు వెళ్తుంది. కానీ, ఆయన దానిని వీటో పవర్ తో రద్దు చేసే అవకాశం ఉంది.
ఇది దేశభక్తి లేని చర్య: ట్రంప్
ఇరాన్ యుద్ధాన్ని ముగించాలని, అమెరికా దళాలను ఉపసంహరించుకోవాలని ప్రతినిధుల సభ ఆమోదించిన తీర్మానాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. ఇది దేశభక్తి లేని చర్య అంటూ ఫైర్ అయ్యారు. ఇరాన్ తో యుద్ధాన్ని ముగించేందుకు తాను జరుపుతున్న తుది దశ చర్చల మధ్యలో ఈ తీర్మానం రావడం చర్చలకు ఆటంకం కలిగించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్ ద్వారా స్పందిస్తూ.. ‘ఎవరు ఇంతటి దేశభక్తి లేని పని చేస్తారు? చర్చలు ఏ స్థితిలో ఉన్నాయో వారికి తెలుసు’ అని పేర్కొన్నారు.
ఈ తీర్మానం అమెరికా బలాన్ని అంతర్జాతీయ స్థాయిలో తగ్గిస్తుందని ట్రంప్భావిస్తున్నారు. యుద్ధాన్ని ముగించడానికి చర్చలు జరుగుతున్న తరుణంలో, ఇలాంటి అంతర్గత విభేదాలు బయటపడటం వల్ల ఇరాన్ ముందు అమెరికా బలహీనంగా కనిపిస్తుందని.. అందుకే దీనిని దేశభక్తి లేని చర్య అని ఆయన విమర్శించారు. కాగా, ఇరాన్ గనుక అమెరికా సైనికులను చంపితే.. ఆ దేశంతో మళ్లీ పూర్తి స్థాయి యుద్ధానికి దిగుతానని ట్రంప్ తన అనుచరులతో ప్రైవేట్‌గా అన్నట్లు అమెరికా అధికారులు తెలిపారు. గత కొన్ని వారాలుగా ఇరు దేశాల మధ్య చిన్నపాటి ఘర్షణలు జరుగుతున్నప్పటికీ, వైమానిక దాడుల నిలిపివేత నిర్ణయం ఇంకా అమల్లోనే ఉందని వారు స్పష్టం చేశారు.
ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య మరోసారి సీజ్ ఫైర్
వాషింగ్టన్: ఇజ్రాయెల్, లెబనాన్ దేశాలు తాత్కాలిక కాల్పుల విరమణ (సీజ్ ఫైర్) ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవడానికి అంగీకరించాయి. ఇందులో భాగంగా లెబనాన్ భూభాగంలో హెజ్బొల్లా ఉగ్రవాదుల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధిస్తూ కొన్ని సెక్యూరిటీ జోన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. అమెరికా మధ్యవర్తిత్వంతో జరిగిన చర్చల అనంతరం ఇరుదేశాలు సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. లితాని నదికి దక్షిణంగా ఉన్న ప్రాంతాల నుంచి హెజ్బొల్లా సాయుధ బలగాలు పూర్తిగా వైదొలగాలని, ఇజ్రాయెల్‌పై దాడులను పూర్తిగా నిలిపేయాలని ఒప్పందంలో పేర్కొన్నారు.
ఈ భద్రతా జోన్లను ఎలా ఏర్పాటు చేస్తారనే దానిపై స్పష్టత రానప్పటికీ, ఆయా ప్రాంతాలపై పూర్తి నియంత్రణను లెబనాన్ కు అప్పగించనున్నారు. లెబనాన్ భవిష్యత్తును ఏ ఇతర దేశం, సాయుధ శక్తులు బందీగా మార్చలేవని ప్రకటనలో తెలిపారు. లెబనాన్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటున్న ఇరాన్‌ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసినట్టు భావిస్తున్నారు. కాగా, ఇజ్రాయెల్, లెబనాన్ ప్రభుత్వాల మధ్య కుదిరిన తాజా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ మద్దతు గల హెజ్బొల్లా చీఫ్ నయీమ్ ఖాసిం తీవ్రంగా ఖండించారు. లెబనాన్ భూభాగం నుంచి ఇజ్రాయెల్ దళాలు పూర్తిగా వైదొలగాలని ఆయన డిమాండ్ చేశారు.
