Fact Check: ఎయిర్‌టెల్ 5G డేటా హాట్‌స్పాట్ షేరింగ్ నిలిపేసిందా..? అసలు నిజం ఇదే..

Fact Check: ఎయిర్‌టెల్ 5G డేటా హాట్‌స్పాట్ షేరింగ్ నిలిపేసిందా..? అసలు నిజం ఇదే..

ఎయిర్‌టెల్ అన్‌లిమిటెడ్ 5G డేటాను మొబైల్ హాట్‌స్పాట్ ద్వారా ఇతర డివైస్‌లకు షేర్ చేయకుండా కంపెనీ అడ్డుకుందని ఇటీవల సోషల్ మీడియాలో భారీగా ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారంలో నిజం లేదని తాజా వివరాలు స్పష్టం చేస్తున్నాయి. ఎలాంటి టెక్నికల్ ఆధారాలు లేకుండానే తప్పుడు ప్రచారం జరుగుతోందని వెల్లడైంది.

సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్టుల్లో ఎయిర్‌టెల్ తన అన్‌లిమిటెడ్ 5G డేటా ఆఫర్‌లో హాట్‌స్పాట్ వినియోగాన్ని నిలిపివేసిందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వాదనలు కంపెనీ నిబంధనల్లో గతంలో ఉన్న ఒక క్లాజ్‌ను తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే వచ్చాయని తేలింది. హాట్‌స్పాట్ పనిచేయడం ఆగిపోయిందని నిరూపించే సాంకేతిక పరీక్షలు, వీడియోలు, ధృవీకరించిన వినియోగదారుల ఆధారాలు ఏవీ బయటకు రాలేదు.

వాస్తవానికి ఎయిర్‌టెల్ వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌ల నుంచి ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్‌లు, ఇతర ఫోన్‌లకు హాట్‌స్పాట్ ద్వారా డేటాను ఎలాంటి ఇబ్బంది లేకుండా షేర్ చేస్తూనే ఉన్నారు. గతంలో ఆ క్లాజ్ నిబంధనల్లో ఉన్న సమయంలో కూడా హాట్‌స్పాట్ సేవలు పనిచేశాయి. ప్రస్తుతం కంపెనీ హాట్‌స్పాట్‌కు సంబంధించిన క్లాజ్‌ను నిబంధనల నుంచి తొలగించింది. అయినప్పటికీ హాట్‌స్పాట్ ఫీచర్‌లో ఎలాంటి మార్పు లేకుండా వినియోగదారులకు అందుబాటులోనే ఉంది.

మొత్తానికి ఎయిర్‌టెల్ అన్‌లిమిటెడ్ 5G డేటాను హాట్‌స్పాట్ ద్వారా ఉపయోగించకుండా కంపెనీ అడ్డుకుందనే ప్రచారం పూర్తిగా తప్పుడు సమాచారంగా తేలిపోయింది. కేవలం ఒక క్లాజ్ ఆధారంగా ఎలాంటి నిర్ధారణ లేకుండానే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం వైరల్ అయ్యాయి.