యెమెన్ తీరంలో వాణిజ్య ట్యాంకర్ హైజాక్... ట్యాంకర్‌‌ ను ఆధీనంలోకి తీసుకున్న సోమాలియా సముద్రపు దొంగలు

యెమెన్ తీరంలో వాణిజ్య ట్యాంకర్ హైజాక్... ట్యాంకర్‌‌ ను ఆధీనంలోకి తీసుకున్న సోమాలియా సముద్రపు దొంగలు

మొగాదిషు(సొమాలియా): అంతర్జాతీయ సముద్ర జలాల్లో సొమాలియా సముద్రపు దొంగలు మళ్లీ రెచ్చిపోయారు. యెమెన్ తీరంలో టాంజానియా జెండాతో ప్రయాణిస్తున్న ఒక వాణిజ్య ట్యాంకర్‌‌ను దుండగులు హైజాక్ చేసినట్లు భద్రతా వర్గాలు ఆదివారం తెలిపాయి. ‘ఎంటీ అసానా’ అనే ఈ ట్యాంకర్ శుక్రవారం యెమెన్‌‌లోని ముకల్లా రేవు నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే హైజాక్‌‌కు గురైంది. సుమారు ఏడుగురు సాయుధ సొమాలియా సముద్రపు దొంగలు నౌకలోకి చొరబడి, దానిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 

ప్రస్తుతం ఈ నౌకను సొమాలియాలోని ఈశాన్య బారి ప్రాంతంలోని 'కాలులా' తీరానికి తరలించి, అక్కడ నిలిపి ఉంచినట్లు సమాచారం. వెసెల్-ట్రాకింగ్ డేటా ప్రకారం.. గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌‌లో ప్రయాణిస్తున్న సమయంలో ఈ నౌక వేగం అసాధారణంగా కేవలం 2 నాట్లకు పడిపోయింది. 

హైజాక్ సమయంలో నౌక నుంచి అత్యవసర సహాయ సంకేతాలు అందినట్లు రక్షణ రంగ నిపుణులు గుర్తించారు. అయితే, ఈ నౌకలో మొత్తం ఎంతమంది సిబ్బంది ఉన్నారు..? వారి పరిస్థితి ఎలా ఉందనే వివరాలు తెలియరాలేదు.