న్యూఢిల్లీ: క్రికెట్ మక్కాగా పేరొందిన ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో చారిత్రాత్మక సెంచరీతో విమర్శకుల నోర్లు మూయించిన టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ తొలిసారి తన రిటైర్మెంట్ పుకార్లపై స్పందించారు. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ ముగిసిన అనంతరం హిట్ మ్యాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇటువంటి రూమర్స్, విమర్శలు ఉంటేనే మజా ఉంటుందని అన్నారు. తనకు విమర్శలు కొత్తేమి కాదని.. తన సుదీర్ఘ కెరీర్లో ఇటువంటి అటుపోట్లు ఎన్నో చూశానని అన్నారు. ఇటువంటి విమర్శలు, రూమర్స్ ఎన్ని వచ్చిన తాను పట్టించుకోనని.. తన దృష్టి మొత్తం కేవలం ఆటపైనే ఉంటుందని స్పష్టం చేశారు.
‘‘నేను అరంగేట్రం చేసినప్పటి నుంచి నాపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. నేను జట్టులో ఉన్నంత కాలం ఆ విమర్శలు వస్తూనే ఉంటాయి. అది నాకు ముఖ్యం కాదు. మైదానంలో నేను ఏమి చేస్తాననేదే ముఖ్యం. జట్టు విజయంలో నా వంతు సహకారం అందించడానికి ప్రయత్నించాలనుకుంటున్నాను. నా దృష్టి అంతా దానిపైనే ఉంది. అయినా ఇలాంటి రూమర్స్, విమర్శలు లేకపోతే సరదా ఉండదు’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నారు.
విరాట్ తో బ్యాటింగ్ వేరే లెవల్:
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో తన స్నేహం, కలిసి బ్యాటింగ్ చేయడం గురించి రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీతో కలిసి బ్యాటింగ్ చేయడం చాలా సరదగా ఉంటుందన్నాడు. మేము ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటామని.. క్రీజులో ఆలోచనలను పంచుకుంటామని తెలిపారు. కెరీర్లో కోహ్లీ, తాను ఎన్నో విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పామని చెప్పారు. లార్డ్స్ వన్డేలో మా ఇద్దరి పార్టనర్ షిప్ కూడా చాలా బాగుందన్నారు.
