- తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఓట్లే టార్గెట్
- ఈసీని అడ్డుపెట్టుకొని ‘సర్’ పేరిట పాలిటిక్స్
- దేశానికి నరేంద్ర మోదీ అత్యంత ప్రమాదకరం
- ప్రజల మద్దతు కూడగట్టలేక కొత్త దారులు
- రైతు ఉద్యమాల ఎన్‌సైక్లోపీడియా సారంపల్లి
- మల్లారెడ్డి సంస్మరణ సభలో సీఎం రేవంత్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో ఏకంగా కోటి ఓట్లను గల్లంతు చేసేందుకు బీజేపీ భారీ కుట్రకు తెరలేపిందని సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా గెలవలేక దొడ్డిదారిన కుట్రలు చేస్తోందని అన్నారు. దేశానికి ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా మారారని, ఆయనను ఓడించడమే కమ్యూనిస్టుల నిజమైన గెలుపు అని పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన ప్రముఖ రైతు ఉద్యమ నేత కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి సంస్మరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రసంగించారు.
ఎన్నికల సంఘాన్ని అడ్డం పెట్టుకొని బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల మద్దతు కూడగట్టలేక బీజేపీ కొత్తదారులు వెతుకుతోందని, ‘సర్’ పేరుతో బీజేపీ వ్యతిరేక ఓట్లను పక్కా ప్లాన్ ప్రకారం తొలగిస్తున్నదని ఫైర్ అయ్యారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ఓట్లే లక్ష్యంగా ప్రైవేటు ఏజెన్సీలను పెట్టి బూత్‌లవారీగా సర్వేలు చేయిస్తున్నారని పేర్కొన్నారు.
పశ్చిమ బెంగాల్‌లో చేసినట్టే తెలంగాణలోనూ చేస్తామని బీజేపీ నేతలు బరితెగించి మాట్లాడుతున్నారని, గత ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా పడిన ఓట్లను ఏరికోరి తొలగిస్తున్నారని ఆరోపించారు. ఇంత పెద్ద కుట్ర జరుగుతుంటే రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కనీసం ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని, దీని వెనుక వారికున్న లోపాయికారి ఒప్పందాన్ని కమ్యూనిస్టులు గుర్తించాలని కోరారు. ఎన్నికలు వేరు.. పేదల ప్రాథమిక హక్కులు వేరని, పేదల ఓటు హక్కును కాపాడేందుకు కమ్యూనిస్టులు పోరాడాలని పిలుపునిచ్చారు.
ఎర్రజెండా కనిపిస్తే పేదవాడికి కొండంత భరోసా
ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి పోటీ చేసినా, చేయకపోయినా.. కమ్యూనిస్టుల నిరంతర పోరాటం వల్లనే కాంగ్రెస్ పేదల పక్షాన నిలిచిందని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. సమాజంలో ఎర్రజెండా కనిపిస్తే పేదవాడికి కొండంత భరోసా ఉంటుందని, భూమి లేని నిరుపేదలకు కనీస కూలీ ఉండాలని కమ్యూనిస్టులు కొట్లాడితే.. కనీస వేతన చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్సేనని చెప్పారు. దున్నేవాడికే భూమి కావాలని ఎర్రదండు పోరాడితే.. 24 లక్షల 56 వేల ఎకరాల అసైన్డ్ భూములను పేదలకు పంచింది కాంగ్రెస్ సర్కారేనని పేర్కొన్నారు.
మరో 10 లక్షల ఎకరాల భూములు ఆదివాసీల చేతుల్లో ఉన్నాయని, ఉపాధి హామీ చట్టం తెచ్చినా, ఆహార భద్రతా చట్టాన్ని అమలు చేసినా.. అది కమ్యూనిస్టుల పోరాటానికి కాంగ్రెస్ చూపిన పరిష్కారమేనని తెలిపారు. నేడు దేశాన్ని పీడిస్తున్న మోదీ సర్కారుకు వ్యతిరేకంగా మనమంతా ఏకతాటిపైకి వచ్చి పోరాడాల్సిన సమయం వచ్చిందన్నారు.
రైతాంగం కోసమే సారంపల్లి జీవితం అంకితం
రైతాంగం కోసం తన జీవితాన్ని ధారపోసిన మహోన్నత నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి అని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. మారుమూల గ్రామం నుంచి జాతీయ స్థాయి వరకు ఎదిగి, రైతు సమస్యలపై సంస్కారవంతంగా గళమెత్తడంలో ఆయనకు ఆయనే సాటి అని పేర్కొన్నారు. నేల స్వభావం, భూమి సారం నుంచి పంట చేతికొచ్చే వరకు ప్రతి అంశాన్ని ఔపోసన పట్టిన ‘ఎన్‌సైక్లోపీడియా’ సారంపల్లి అని గుర్తు చేశారు.
కౌలు రైతుల కష్టాలు, పంటలకు గిట్టుబాటు ధరపై ఆయన చేసిన పోరాటాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయనంటే తనకు వ్యక్తిగతంగా ఎంతో గౌరవం, అభిమానం అని, సారంపల్లి రాసిన పుస్తకాలు, ఆయన లేవనెత్తిన అంశాలను ప్రామాణికంగా తీసుకునే తమ ప్రజా ప్రభుత్వం రైతాంగ సమస్యలను పరిష్కరిస్తున్నదని తెలిపారు. సారంపల్లి మల్లారెడ్డి పేరు సమాజంలో చిరస్థాయిగా నిలిచిపోయేలా మంత్రివర్గ సహచరులతో చర్చించి త్వరలోనే కీలక నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
‘నా నాగేటి సాళ్లు’ ఆవిష్కరణ
దివంగత సారంపల్లి మల్లారెడ్డి స్వీయ రచన ‘ నా నాగేటి సాళ్లు’ పుస్తకాన్ని సీపీఎం పూర్వ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అజారుద్దీన్, ఎమ్మెల్యేలు నవీన్ యాదవ్, రాజ్ ఠాకూర్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, సీపీఎం సీనియర్ నేతలు తమ్మినేని వీరభద్రం, ఎస్. వీరయ్య, సీపీఐ, ఇతర వామపక్షాల నేతలు పాల్గొన్నారు.
ఎర్ర జెండాలన్నీ ఏకం కావాలి : కూనంనేని
దివంగత సారంపల్లి మల్లారెడ్డి సకలగుణ సంపన్నుడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. ఆయన గొప్ప వ్యక్తి అని, ఆయనలో ఒక టీచర్, రైతు, ఇంజినీర్ కనిపిస్తారన్నారు. తాను అసెంబ్లీలో వ్యవసాయం గురించి మాట్లాడేది మల్లారెడ్డి సలహాలు, సూచనలతోనేనని చెప్పారు. రైతు ఆత్మహత్యలు జరుగుతున్న కాలంలో మల్లారెడ్డితో కలిసి రైతు సమస్యలపై అనేకసార్లు చర్చించామని టీజేఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరాం గుర్తు చేశారు.
ఆయన ఆధునిక వ్యవసాయ శాస్త్రవేత్త అని, సమాజంలో మార్పు రావాలనేది మల్లారెడ్డి కోరిక అని పేర్కొన్నారు. మల్లారెడ్డి కేవలం తెలంగాణ రైతు ఉద్యమానికి మాత్రమే నాయకుడు కాదని, ఆయన ఉమ్మడి రాష్ట్రానికే నాయకుడు అని సీపీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. మల్లారెడ్డి మరణం బాధాకరమని, రైతాంగ, కమ్యూనిస్టు ఉద్యమాల్లో పోరాటంలో ఆయన కీలక బాధ్యతలు నిర్తర్తించారని సీపీఎం కేంద్రకమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు.
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు హిందూ, ముస్లిం కొట్లాటగా చిత్రీకరిస్తున్నాయని, వీర తెలంగాణ పోరాటం లేకుండా, భూస్వామ్య వ్యతిరేక ఉద్యమాలు లేకుండా నిజాం సంస్థానం దేశంలో విలీనం కాలేదని మల్లారెడ్డి అన్నారని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య గుర్తు చేశారు.
