- మహిళా పోలీసుల ముందే షర్టులు తీసేసి రచ్చ
- పోలీసులపై దాడికి తెగబడిన పాడి కౌశిక్, కేటీఆర్
- ‘వాడు..వీడు..’ అంటూ అనుచిత వ్యాఖ్యలు
- రెండేండ్లలో అధికారంలోకి వస్తం.. అప్పుడు
- ఎవరినీ వదిలిపెట్టబోమని కేటీఆర్ వార్నింగ్
- స్లోగన్స్ ఉన్న బ్లాక్ టీషర్టులతో అసెంబ్లీకి బీఆర్‌ఎస్ సభ్యులు
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్ నేతలు ఓవరాక్షన్ చేశారు. మహిళా పోలీసులు, మహిళా నేతలున్నారన్న సంగతి మరిచిపోయి మితిమీరి ప్రవర్తించారు. హద్దులు దాటి అంగీలు విప్పేసి రచ్చ చేశారు. బనియన్లతో లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు.
పోలీసులు అడ్డుకోవడంతో మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డి తదితరులు బనియన్ల మీదే రోడ్డుపై బైఠాయించారు. పోలీసుల మీదికి వెళ్లేందుకు ప్రయత్నించారు.
‘‘మహిళా పోలీసులను ముందు పెట్టుకుని డ్రామాలు చేస్తున్నారా?’’ అంటూ హంగామా చేశారు. ‘ఎవడ్రా డీసీపీ’ అంటూ రెచ్చిపోయారు. నల్ల టీ షర్టులు వద్దంటే బనియన్ల మీద కూడా రావొద్దన్న రూల్ ఏమైనా ఉందా? అంటూ నిలదీశారు. పోలీసులను ‘వాడు.. వీడు’ అంటూ తీవ్రంగా మాట్లాడారు. ‘ఎవడు మమ్మల్ని ఆపేది’ అని ప్రశ్నించారు. ‘‘ఇంకెన్నాళ్లు సర్వీస్ ఉంది మీకు? రెండేండ్లలో మళ్లీ మేమే వస్తం.. అతి చేసే పోలీసులను, అధికారులను వదిలిపెట్టం’’ అంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. పోలీసులను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తోసేశారు.
వాళ్లను తోసుకుంటూ లోపలకు వెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులు, బీఆర్ఎస్ నేతలకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిపై మహిళా పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. ఇటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరినీ పోలీసులు బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి తెలంగాణ భవన్‌కు తరలించారు.
కాగా, తమపైనే పోలీసులు దురుసుగా ప్రవర్తించారంటూ బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. దీనిపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. సభలోకి అనుమతించకపోవడంపై హైకోర్టులోనూ పిటిషన్ వేశారు.
