- అసెంబ్లీకి నల్ల టీషర్టులతో బీఆర్ఎస్ సభ్యులు
- మెయిన్ గేటు వద్ద అడ్డుకున్న పోలీసులు
- లోనికి దూసుకెళ్లేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల యత్నం
- పోలీసులకు, ఎమ్మెల్యేలకు మధ్య తోపులాట
- స్పీకర్‌పై నోరు పారేసుకున్న తాతా మధు
- ‘ఆ స్పీకర్ గాడేనా ఆదేశాలిచ్చింది..’అన్న మహబూబ్ నగర్ స్థానిక ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి
- మండిపడ్డ కాంగ్రెస్.. ఖండించిన బీజేపీ
- తాతా మధు సభ్యత్వం రద్దుకు డిమాండ్
- అసెంబ్లీ చరిత్రలో చీకటి రోజన్న మంత్రులు
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ సాక్షిగా దళిత స్పీకర్కు అవమానం జరిగింది. సోమవారం శాసన సభ చరిత్రలో బ్లాక్ డేగా మిగిలిపోయింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా చేశాయి. ‘ఆ స్పీకర్ గాడేనా ఆదేశాలిచ్చింది..’ అంటూ నవీన్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయగా.. తాతా మధు మరో అడుగు ముందుకేసి గడ్డం ప్రసాద్కుమార్తల్లిని దూషించారు.
బీఆర్ఎస్ సభ్యులు స్లోగన్స్ ఉన్న నల్ల టీషర్టులు ధరించి అసెంబ్లీకి చేరుకోగా పోలీసులు అడ్డుకున్నారు. నల్ల టీషర్టులు ధరించి రావద్దంటూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను వారించారు. ఈ సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. స్లోగన్స్ ఉన్న బ్లాక్ టీషర్టులతో లోపలికి రానివ్వొద్దన్న ఆదేశాలున్నాయని బీఆర్‌ఎస్ నేతలకు పోలీసు అధికారులు చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే తాతా మధు రెచ్చిపోయారు. ‘
‘ఎవడు మీకు ఆదేశాలిచ్చింది. ఎవడ్రా మీకు చెప్పింది? మా ప్యాంట్లు గుంజాలని ఆ స్పీకర్ గాడు చెప్పిండా?’’ అంటూ ఊగిపోయారు. స్పీకర్తల్లిని ఉద్దేశించి పరుష పదజాలం వాడారు.
‘ఆ స్పీకర్ గాడేనా ఆదేశాలిచ్చింది..’అంటూ నవీన్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇద్దరు ఎమ్మెల్సీల తీరును సభలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు.
అసెంబ్లీ చరిత్రలో ఇది చీకటి రోజని మంత్రులు, ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాతా మధు ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. భవిష్యత్తులో మళ్లీ ఎవరూ ఇలా ప్రవర్తించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పారు.
తాతాను వెనకేసుకొచ్చిన కేటీఆర్
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఉద్దేశించి తాతా మధు చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం సృష్టించాయి. రాజకీయవర్గాలతోపాటు దళిత సంఘాలు కూడా మధు వ్యాఖ్యలపై మండిపడ్డాయి. దళితులను అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి.
దళిత స్పీకర్‌ను అంతేసి మాటలన్న తాతా మధును మందలించాల్సిన బీఆర్‌ఎస్ పార్టీ పెద్దలు.. ఆయనను వెనకేసుకొని రావడం గమనార్హం. మధు స్పీకర్‌ను ఉద్దేశించి ఆ మాటలు అనలేదంటూ కేటీఆర్ కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. వీడియోలో అంత క్లియర్‌గా మధు వ్యాఖ్యలు చేసినట్టు ఉన్నా.. గేటు దగ్గర ఆపేశారన్న ఆవేశంతో పోలీసులను అన్నారేమోనని కామెంట్ చేయడం గమనార్హం.
దళిత సమాజాన్ని అవమానించడమే
స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను అవమానించడమంటే యావత్ దళిత సమాజాన్ని అవమానించడమే. తాతా మధు వ్యాఖ్యలు.. ప్రజాస్వామ్యానికి, శాసన వ్యవస్థ గౌరవానికి తీవ్ర భంగం కలిగించేలా ఉన్నాయి. ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ జరిపిన చర్చల ప్రభావమే బీఆర్‌ఎస్ నేతల వ్యాఖ్యల్లో కనిపించింది. దళితుల పట్ల కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదన్న విషయం మరోసారి బయటపడ్డది. బీఆర్ఎస్ నేతలే పోలీసులపై దాడులు చేసి, పోలీసులే దాడి చేసినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నరు.- మంత్రి వివేక్ వెంకటస్వామి
కేటీఆరే పోలీసులపై దాడి చేసిండు
కేటీఆరే స్వయంగా పోలీసులపై దాడి చేసినట్లు వీడియోలో స్పష్టంగా కనిపించింది. సీనియర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరు చాలా దారుణంగా ఉంది. కొందరు పోలీస్ కాలర్ పట్టుకున్నారు. కొందరు పిడిగుద్దులు కురిపించారు. మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలీసులను గౌరవించామే తప్ప ఏనాడూ ఇలా దాడులు చేయలేదు. ఫ్లకార్డులతో, టీషర్టులపైన స్లోగన్స్ తో సభకు రావడం సభా సంప్రదాయాలకు విరుద్ధం - మంత్రి శ్రీధర్ బాబు
ఆ ఎమ్మెల్సీల సభ్యత్వం రద్దు చేయాలి
ఒక దళిత స్పీకర్ ను ‘అధ్యక్షా..’ అని పిలవడం ఇష్టం లేకనే కేసీఆర్ సభకు రావడం లేదు. తాతా మధు, నవీన్‌రెడ్డి స్పీకర్ చైర్‌ను అవమానపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. వాటిని వెరిఫై చేసి సభ నుంచి వారిద్దరినీ శాశ్వతంగా బయటకు పంపించాలి. స్పీకర్ మీద ఎమ్మెల్సీలు చేసిన అనుచిత వ్యాఖ్యలపై సభలో చర్చ జరుగుతుంటే బీజేపీ ఎమ్మెల్యేలు అడ్డుకోవడం సరికాదు.
- మంత్రి పొన్నం ప్రభాకర్ -
ఆ తల్లి ఆత్మ ఎంత క్షోభిస్తుందో..
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. స్పీకర్, ఆయన తల్లి పట్ల అత్యంత అవమానకరంగా మాట్లాడడం బాధాకరం. అణగారిన వర్గాలు అత్యున్నత పదవుల్లో కూర్చుంటే ఓర్వలేకపోతున్నారు. ఇవాళ స్పీకర్ తల్లిని బీఆర్ఎస్ సభ్యులు దూషించినందుకు ఆ తల్లి ఆత్మ ఎంత క్షోభిస్తుందో.. ఆయనను కనడమే ఆ తల్లి చేసిన నేరమా? తాతా మధు, నవీన్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి.
- మంత్రి సీతక్క
