- మంత్రి సీతక్క మాట్లాడుతుండగా భావోద్వేగం
- భౌతికంగా లేని తల్లిని అవమానించిన BRS ఎమ్మెల్సీలు
- BRS MLC లు తాతా మధు, నవీన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలన్న మంత్రి
- సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించారని ఫైర్
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వ్యవహరించిన తీరుతో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అసెంబ్లీ గేటు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ సభలో మంత్రి సీతక్క మాట్లాడుతుండగా.. కంటతడి పెట్టుకున్నారు.
భౌతికంగా లేని తన తల్లిని నిందించడంపై సభాపతి కంటతడి పెట్టుకోవడం సభలోని సభ్యులను కలచి వేసింది. ‘‘స్పీకర్ సార్ మహిళా సభ్యులందరినీ ఆడబిడ్డల్లాగా చూసుకుంటారు.. ఇవాళ లేని మీ తల్లిని బీఆర్ఎస్ సభ్యులు దూషించినందుకు ఆ తల్లి ఆత్మ ఎంత క్షోభిస్తుందో.. ’’ అని సీతక్క అనడంతో స్పీకర్ కర్చిఫ్‌తో కళ్లు తుడ్చుకున్నారు.
స్పీకర్‌ను, ఆయన తల్లిని అవమానించిన తాతా మధు సభ్యత్వాన్ని వెంటనే తొలగించాలని, ఇందుకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. “ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలి. వారిద్దరిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి. బీఆర్ఎస్ వాళ్లు నిన్న నీతులు, ఇవాళ బూతులు మాట్లాడారు .
కేసీఆర్ రెండున్నరేళ్లు అసెంబ్లీకి రాకుండా ఫార్మ్ హౌస్ కే పరిమితమయ్యారు. నిన్న సీఎంకు సంస్కారం లేదని మాట్లాడారు. మరి వాళ్ల సభ్యులకు ఎలాంటి సంస్కారం నేర్పించి పంపాడు?’’ అంటూ సీతక్క ప్రశ్నించారు. ఇది స్పష్టంగా కేసీఆర్ డైరెక్షన్‌లోనే జరిగిందని ఆరోపించారు.
‘‘బీఆర్ఎస్ అంటేనే దురహంకార పార్టీ. దళితులంటే వాళ్లకు గిట్టదు. గతంలో భట్టి విక్రమార్క ప్రతిపక్ష నేతగా ఉంటే ఆ పదవి నుంచి తీసే వరకు ఊరుకోలేదు. రాజయ్యను రాత్రికి రాత్రి ఎందుకు తీసేశారో ఇప్పటికీ తెలీదు. గతంలో స్పీకర్‌ను ఉద్దేశించి “అసెంబ్లీ నీ సొత్తు కాదు” అని జగదీశ్వర్ రెడ్డిమాట్లాడారు. ‘‘చదువుకున్నాం అని విర్రవీగుతున్నారుగానీ మీ సంస్కారం ఎక్కడ ఉంది?’’ అని నిలదీశారు.
ఆ ఎమ్మెల్సీల సభ్యత్వం రద్దు చేయాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
ఒక దళిత స్పీకర్‌ను ‘అధ్యక్షా..’ అని పిలిచేందుకు ఇష్టం లేని కేసీఆర్ సభకు రావడం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డి ఏకంగా ఆ చెయిర్‌ను అవమానపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.
ఈ ఇద్దరు మాట్లాడిన వీడియో, ఆడియో రికార్డులను వెరిఫై చేసి సభ నుంచి శాశ్వతంగా బయటకు పంపించాలని డిమాండ్ చేశారు. ‘‘సభ్యుల హక్కులకు, గౌరవ మర్యాదలకు భంగం కలిగితే కాపాడాల్సిన మీపైనే ఆ ఇద్దరు ఎమ్మెల్సీలు ఇలా మాట్లాడడం బాధాకరం. వెంటనే ఆ ఇద్దరిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి’’ అని తేల్చి చెప్పారు.
స్పీకర్ మీద ఎమ్మెల్సీలు చేసిన అనుచిత వ్యాఖ్యలపై సభలో చర్చ జరుగుతుంటే బీజేపీ ఎమ్మెల్యేలు అడ్డుకోవడాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ తప్పుపట్టారు. బీజేపీలో దళిత ఎమ్మెల్యేలు ఎవరూ లేకపోతే తమకేమీ సంబంధం లేదన్నట్టు వ్యవహరించడం సరికాదని అన్నారు.
స్పీకర్‌ను అవమానించడం సరికాదు: అడ్లూరి
అసెంబ్లీని గౌరవించాల్సిన ఎమ్మెల్యేలు రణరంగంగా మార్చారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మండిపడ్డారు. నిరసన తెలిపే హక్కు ఎమ్మెల్యేలకు ఉందని, కానీ ఆ సాకుతో స్పీకర్‌ను అవమానించడం సరికాదని పేర్కొన్నారు.
రెండున్నరేండ్లుగా ఒక దళితుడు స్పీకర్ సీట్లో ఉంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు “ స్పీకర్‌ను అవమానించి.. ఇప్పుడు ప్రజాస్వామ్యంపై ఉపన్యాసాలు ఇవ్వడం బీఆర్‌ఎస్‌కే చెల్లింది. దళిత బిడ్డ స్పీకర్ కుర్చీలో కూర్చుంటే గౌరవించలేని మనస్తత్వం ఎవరిదో తెలంగాణ సమాజం చూస్తున్నది.
పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష సభ్యుల హక్కులు మీకు గుర్తుకు వచ్చాయా? ప్రజాస్వామ్యంపై ఇంత ప్రేమ ఉంటే.. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామన్న మాట ఎందుకు నిలబెట్టుకోలేదు. సభలో చర్చ కావాలంటే చర్చకు రావాలి.
ప్రీ ప్లాన్డ్ రాజకీయ డ్రామాలతో సభను అడ్డుకున్నారు. ఏదైనా ఘటన జరిగి ఉంటే చట్టబద్ధంగా విచారణ కోరండి.. కానీ విచారణకు ముందే తీర్పులు చెప్పి ప్రజలను రెచ్చగొట్టొద్దు” అని హితవు పలికారు. శాసనసభను కౌరవ సభ అంటున్న మీరు ముందుగా సభా సంప్రదాయాలను గౌరవించాలని హరీశ్ రావుకు చురకలంటించారు.
