తెలంగాణలో సర్ గడువు పొడిగింపు.. అక్టోబర్ 7వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ

తెలంగాణలో సర్ గడువు పొడిగింపు.. అక్టోబర్ 7వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ
  • క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ
  •  
  •     నవంబర్​ 5  వరకు 
  • నోటీసుల విచారణ ప్రక్రియ
  •     నవంబర్ 9న 
  • తుది ఓటర్ల జాబితా విడుదల
  •     షెడ్యూల్ సవరించిన 
  • కేంద్ర ఎన్నికల సంఘం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ -(సర్) గడువును పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్​ రెడ్డితో పాటు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కమిషన్, సవరించిన తాజా షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ నిర్ణయంతో ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, మార్పులు, చేర్పులు అభ్యంతరాల దాఖలుకు అదనపు సమయం లభించింది. గతంలో ఖరారు చేసిన షెడ్యూల్‌ ప్రకారం సెప్టెంబర్‌ 16తో ముగియాల్సిన క్లెయిమ్స్‌, అభ్యంతరాల స్వీకరణ గడువును అక్టోబర్‌ 7 వరకు పొడిగించారు. 

అదేవిధంగా గతంలో అక్టోబర్‌ 19న విడుదల కావాల్సిన తుది ఓటర్ల జాబితా ప్రచురణను నవంబర్‌ 9వ తేదీకి రీషెడ్యూల్‌ చేశారు. క్షేత్రస్థాయిలో ఓటరు నమోదు ప్రక్రియ పకడ్బందీగా సాగేందుకు, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేందుకు ఈ నిర్ణయం ఉపకరిస్తుందని భావిస్తున్నారు. ఎన్నికల విధుల్లో నిమగ్నమైన సిబ్బందిపై పనిభారం తగ్గడంతో పాటు దరఖాస్తుదారులకు తగిన సమయం దక్కడంతో, అటు ఓటర్లకు, ఇటు క్షేత్రస్థాయి అధికారులకు ఇది ఊరటనిచ్చినట్లయింది. 

ఎన్నికల సంఘం జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం  క్లెయిమ్స్‌, అభ్యంతరాల దాఖలుకు గతంలో ఆగస్టు 17  నుంచి ఈ నెల 16  వరకు గడువు ఉండగా, తాజా నిర్ణయంతో దాన్ని వచ్చే నెల 7 వరకు పొడిగించారు. నోటీసుల జారీ, అందిన దరఖాస్తులు, అభ్యంతరాల విచారణ ప్రక్రియకు గతంలో అక్టోబర్​ 15 వరకు సమయం ఉండగా, సవరించిన షెడ్యూల్‌ ప్రకారం నవంబర్  5వ తేదీ వరకు పూర్తి చేయనున్నారు.   

బీఎల్​ఏల హెల్ప్​ తీసుకోండి: సీఈఓ సుదర్శన్ రెడ్డి 

రాష్ట్రంలో సర్​ ప్రక్రియను మరింత వేగవంతం చేసి, అత్యంత బాధ్యతాయుతంగా పూర్తి చేయాలని సీఈఓ సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. అదనపు సీఈఓ డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి, డిప్యూటీ సీఈఓ జీఎస్. చారితో కలిసి జీహెచ్‌ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారితోపాటు జిల్లాల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో ఆయన మాట్లాడారు. 

ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ..  బీఎల్‌ఓలు ప్రతి నోటీసును ఓటరుకు స్వయంగా అందించాలని, పట్టణ ప్రాంతాల్లో అడ్రస్‌ల గుర్తింపు కోసం బూత్ లెవల్ ఏజెంట్ల సహకారం తీసుకోవాలని సూచించారు. జిల్లాలకు అందించిన అదనపు లాగిన్‌లను సమర్థవంతంగా వినియోగించుకుంటూ పెండింగ్ పనులను గడువులోగా క్లియర్ చేయాలని స్పష్టం చేశారు. 

అన్-మ్యాపింగ్, డేటా లోపాల జాబితాలను రాజకీయ పార్టీల సమావేశాల్లో పంచుకోవాలని, దావాలు, -అభ్యంతరాల స్వీకరణ సమయంలో బీఎల్‌ఏలు చురుగ్గా పాల్గొనేలా ప్రోత్సహించాలని అధికారులను కోరారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా డాక్యుమెంట్ల అప్‌లోడింగ్ ప్రక్రియ సక్రమంగా జరగాలని, కంప్యూటర్ ఆపరేటర్లు చేసే పొరపాట్లకు ఈఆర్‌ఓ, ఏఈఆర్‌ఓలనే బాధ్యులను చేస్తామని హెచ్చరించారు. 

విచారణ కేంద్రాల పరిధిలోకి రాని వయోవృద్ధులు, దివ్యాంగుల నివాసాలకే నేరుగా వెళ్లి తనిఖీలు చేపట్టాలని సూపర్వైజర్లను ఆదేశించారు. ఓటర్లకు తక్షణ సహాయం అందించేందుకు ఈఆర్‌ఓ, డీఈఓ స్థాయిల్లో హెల్ప్ డెస్క్‌లను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు.