- పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ పిలుపు
- కాంగ్రెస్ పార్టీ కేడర్‌కు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ పిలుపు
- తాతా మధుపై చర్యల కోసం
- స్పీకర్, మండలి చైర్మన్‌ను కలిసిన ..
- మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
హైదరాబాద్, వెలుగు: స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వాడిన భాషకు నిరసనగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చేయాలని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ పిలపునిచ్చారు. దళిత స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు. సభ్యసమాజం తలదించుకునేలా ఉన్న ఈ వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలకు, శాసన వ్యవస్థ గౌరవానికి విరుద్ధమని మండిపడ్డారు.
బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎమ్మెల్సీ తాతా మధు క్షమాపణలు చెప్పాలని, అతన్ని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. శాసన మండలి నిబంధనల ప్రకారం తాతా మధు సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు. దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఎట్టిపరిస్థితుల్లో సహించదని ఆయన స్పష్టం చేశారు.
ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ ఈ ఘటనపై స్పందించి, తాతా మధు వ్యాఖ్యలను ఖండించడంతో పాటు దళిత సమాజానికి, స్పీకర్ కు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ కేడర్ ఈ ఘటనను నిరసిస్తూ ఎక్కడికక్కడ ఆందోళనలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
ఎంపీ, పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో గాంధీ భవన్ లో తాతా మధు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు మెట్టు సాయి కుమార్, చనగాని దయాకర్ తదితరులు పాల్గొన్నారు.
స్పీకర్‌కు ప్రజాప్రతినిధుల సానుభూతి
అసెంబ్లీ, శాసన మండలిలో సైతం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తాతా మధు వ్యాఖ్యలపై మండిపడ్డారు. స్పీకర్ కార్యాలయానికి వెళ్లిన పలువురు మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయనకు సంఘీభావం ప్రకటించి, తమ సానుభూతిని వ్యక్తం చేశారు.
తాతా మధుపై చర్యలకు ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేయాలని స్పీకర్‌కు వినతి ప్రతం ఇచ్చారు. అనంతరం శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఆయనకు ఓ వినతి పత్రం ఇచ్చారు. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తాతా మధు శాసన మండలి సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని కోరారు.
