కేరళ రాష్ట్రం పులకించిపోతుంది. వర్షాలతో తడిసి ముద్దవుతుంది. నిన్నా మొన్నటి వరకు మండే ఎండలతో ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరి అయిన కేరళ రాష్ట్రం.. ఇప్పుడు చల్లటి గాలులతో.. వర్షాలతో సేదతీరుతుంది. ఇప్పటికే మూడు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతుండగా.. మరో 8 జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఎనిమిది జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ ఇచ్చింది. అంటే భారీ వర్షాలు పడతాయని జనాన్ని హెచ్చరించింది.. అప్రమత్తం చేసింది వాతావరణ శాఖ.
తిరువనంతపురం, పతనంతిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకుళం, కన్నూర్, కాసర్ గోడ్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం పడుతుంది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి.
తిరువనంతపురం నుంచి త్రిశూర్ వరకు భారీ వర్షాలు పడతాయని వెల్లడించిన వాతావరణ శాఖ.. ఇప్పటికే కొట్టాయం, అలప్పుజ జిల్లాల్లో వానలు పడుతున్నాయని వివరించింది. భారీ వర్షాల పడుతున్న క్రమంలో కన్నూర్ జిల్లాలోని పళస్సి డ్యామ్ గేట్లు తెరుస్తామని.. డ్యామ్ లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేరళ ఇంజినీరింగ్ అధికారులు హెచ్చరించారు. డ్యామ్ లో ఉన్న నీటిని విడతల వారీగా కిందకు విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేశారు అధికారులు.
రాబోయే మూడు, నాలుుగు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో చేపల వేటపై నిషేధం విధించింది కేరళ ప్రభుత్వం. కొండ ప్రాంతాల్లో ఉండే జనం అప్రమత్తంగా ఉండాలని.. కొండ చరియలు విరిగి పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. నదులు, వాగులు సమీపంలో ఉండే ప్రజలు నీటి మట్టాలు చూసుకుంటూ ఉండాలని.. నీటి మట్టం పెరిగితే అక్కడి నుంచి మైదాన ప్రాంతాలకు తరలివెళ్లాలని ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది కేరళ ప్రభుత్వం.
