పారిస్: రష్యా టీనేజ్ టెన్నిస్ స్టార్ మిరా ఆండ్రీవా.. ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్లోకి ప్రవేశించారు. గ్రాండ్‌స్లామ్ టోర్నీలో టైటిల్ ఫైట్‌కు అర్హత సాధించడం ఆమెకు ఇదే తొలిసారి. గురువారం జరిగిన విమెన్స్ సింగిల్స్ సెమీస్‌లో ఎనిమిదో సీడ్ ఆండ్రీవా 6–1, 6–3తో మార్టా కోస్టియుక్ (ఉక్రెయిన్)పై గెలిచింది. గంటా 16 నిమిషాల మ్యాచ్‌లో ఆండ్రీవా బలమైన సర్వీస్‌లతో చెలరేగింది. మ్యాచ్ మొత్తంలో ఆండ్రీవా 2 ఏస్‌లు, 2 డబుల్ ఫాల్ట్స్ చేసింది. 13 బ్రేక్ పాయింట్లలో ఐదింటిని కాచుకుంది. 14 విన్నర్లు, 22 అన్‌ఫోర్స్‌డ్ ఎర్రర్స్‌తో మ్యాచ్‌ను ముగించింది.
ఐదు బ్రేక్ పాయింట్లలో ఒక్కదాన్ని మాత్రమే సద్వినియోగం చేసుకున్న కోస్టియుక్ 34 అన్‌ఫోర్స్‌డ్ ఎర్రర్స్‌తో మూల్యం చెల్లించుకుంది. 4 డబుల్ ఫాల్ట్స్, ఒక్క ఏస్‌కే పరిమితమైంది. మ్యాచ్ పాయింట్ సాధించిన వెంటనే విజయోత్సాహం చూపెట్టిన ఆండ్రీవా.. కోస్టియుక్‌కు షేక్‌హ్యాండ్ ఇవ్వకుండా వెళ్లిపోయింది. మరో సెమీస్‌లో మజా చావ్లిన్‌స్కా (పోలెండ్) 7–6 (7/4), 6–4తో డియానా ష్నెడర్ (రష్యా)పై గెలిచింది. మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో సారా ఎరానీ–ఆండ్రియా వవాసోరి 4–6, 6–3, 10–4తో గాబ్రియోలా డాబ్రోవిస్కి (కెనడా)–ఇవాన్ కింగ్ (అమెరికా)పై గెలిచారు.
