ఈ ఫీల్డ్‌లో జాబ్స్ చేసేటోళ్లను AI కూడా టచ్ చేయలేదు.. సీక్రెట్ చెప్పిన ఐఐటీ ఇంజనీర్

ఈ ఫీల్డ్‌లో జాబ్స్ చేసేటోళ్లను AI కూడా టచ్ చేయలేదు.. సీక్రెట్ చెప్పిన ఐఐటీ ఇంజనీర్

సాఫ్ట్‌వేర్ రంగంలో లేఆఫ్స్ సునామీ, ఏఐ భయాల మధ్య కెరీర్ సేఫ్టీ పై సరికొత్త చర్చ మొదలైంది. IITలో చదివి, అమెరికన్ టెక్ కంపెనీలో ఉద్యోగం కోల్పోయిన ఒక ఇంజనీర్ రెడ్డిట్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఐఐటీ నుంచి వచ్చిన ఇంజనీర్‌గా చెబుతున్నా.. భారతదేశంలో మెడికల్ రంగం మాత్రమే అత్యంత సురక్షితమైనది, ఏఐ కూడా దానిని తాకలేదు అంటూ అతను పెట్టిన పోస్ట్ నెటిజన్లను ఆలోచనలో పడేసింది.

కంపెనీలు ఉద్యోగులను తీసేస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై పెట్టుబడులు పెంచుతుండటంతో టెక్ రంగంలో మనుగడ కష్టంగా మారిందని ఐఐటీ గ్రాడ్యుయేట్ వాపోయాడు. ఐఐటీ ట్యాగ్ ఉండి, పెద్ద పెద్ద కంపెనీల నుంచి రిఫరల్స్ తెచ్చుకున్నా.. గత రెండు నెలలుగా కనీసం ఒక్క ఇంటర్వ్యూ కాల్ కూడా సాధించలేకపోయానని తన బాధను పంచుకున్నాడు. దీనికంటే MBBS చదివిన డాక్టర్లకు లైఫ్ లాంగ్ జాబ్ గ్యారెంటీ ఉంటుందని, సమాజంలో గౌరవంతో పాటు అనుభవం పెరిగేకొద్దీ నెలకు రూ.5 లక్షల నుండి రూ.6 లక్షల వరకు ఈజీగా సంపాదించవచ్చని అభిప్రాయపడ్డాడు.

ఈ పోస్టుపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. డాక్టర్ల జీవితాల్లో ఉండే అసలు కష్టాలను ఇంజనీర్లు తక్కువ చేసి చూస్తున్నారని కొందరు కామెంట్ చేశారు. ఒక మెడికల్ స్టూడెంట్ డాక్టర్‌గా స్థిరపడటానికి కనీసం 12 ఏళ్ల కఠోర శ్రమ పడి యవ్వనం మొత్తాన్ని చదువుకే అంకితం చేయాల్సి ఉంటుందని గుర్తుచేశారు. ఇంజనీర్లు 4 ఏళ్లలోనే సంపాదన మొదలుపెట్టి చిన్న వయసులోనే సెటిల్ అవుతారని, అందుకే చాలామంది డాక్టర్లు తమ పిల్లలను వైద్య వృత్తిలోకి పంపడానికి ఇష్టపడరని అంటున్నారు.

మరికొందరైతే కార్పొరేట్ టెన్షన్లు, ఏఐ భయాలు అసలు ఏమీ లేని ఏకైక సేఫ్ జోన్ గవర్నమెంట్ ఉద్యోగాలే అంటున్నారు. ప్రైవేట్ రంగంలో నిరంతరం స్కిల్స్ అప్‌డేట్ చేసుకోకపోతే ఉద్యోగాలు ఊడతాయని, అదే ప్రభుత్వ టీచర్, అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగాల్లో ఉంటే ఎలాంటి టెక్నాలజీ మార్పులైనా కెరీర్‌ను ఏమీ చేయలేవని పేర్కొన్నారు. మొత్తానికి ఏఐ కాలంలో ఏ కెరీర్ సేఫ్ అనే చర్చ టెక్, మెడికల్, ప్రభుత్వ రంగాల మధ్య ఆసక్తికరంగా మారింది.