సాంకేతిక రంగంలో చైనా మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. కేవలం రెండు సెకన్లలోనే 700 కిలోమీటర్ల వేగాన్ని అందుకుని ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. చైనాకు చెందిన నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ పరిశోధకులు నిర్వహించిన ఈ 'సూపర్ కండక్టింగ్ ఎలక్ట్రిక్ మాగ్లెవ్' పరీక్ష ఇప్పుడు గ్లోబల్ బెంచ్‌మార్క్‌గా నిలిచింది.
400 మీటర్ల పొడవైన మాగ్నెటిక్ లెవిటేషన్ టెస్ట్ లైన్‌పై ఒక టన్ను బరువున్న వాహనాన్ని చైనా రీసెర్చర్స్ ప్రయోగించారు. ఈ వాహనం ఊహించని రీతిలో అతి తక్కువ సమయంలోనే గంటకు 700 కిమీ వేగాన్ని చేరుకోవడమే కాకుండా.. నిర్ణీత దూరం తర్వాత అంతే వేగంగా సురక్షితంగా ఆగింది. దీనికి సంబంధించిన దృశ్యాలను చైనా స్టేట్ బ్రాడ్కాస్టర్ విడుదల చేసింది.
చైనా కొత్త సాంకేతికత కేవలం రైళ్లకే పరిమితం కాదని తెలుస్తోంది. ఇది 'హైపర్‌లూప్' ప్రయాణంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. వాక్యూమ్ సీల్డ్ ట్యూబ్‌ల ద్వారా నగరాల మధ్య నిమిషాల్లో ప్రయాణించే కల దీనితో నిజం కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా అంతరిక్ష ప్రయోగాల్లో రాకెట్లు, ఎయిర్‌క్రాఫ్ట్‌ల లాంచ్‌కు ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ప్రొపల్షన్ టెక్నాలజీని వాడటం ద్వారా భారీగా ఇంధన ఖర్చును తగ్గించవచ్చు.
గత 30 ఏళ్లుగా చైనా మాగ్లెవ్ టెక్నాలజీలో అగ్రస్థానంలో ఉంది. తాజా ప్రయోగం కోసం రీసెర్చ్ టీమ్ గత పదేళ్లుగా శ్రమిస్తోంది. ఈ ఏడాది జనవరిలోనే వీరు 648 కిమీ వేగాన్ని సాధించగా.. ఇప్పుడు దాన్ని అధిగమించి సరికొత్త రికార్డు నెలకొల్పారు. చైనా ఇప్పటికే షాన్‌క్సీ ప్రావిన్స్‌లో 1,000 కిమీ వేగమే లక్ష్యంగా మరో ప్రాజెక్టుపై కూడా పని చేస్తోంది.
ALSO READ : క్రిస్మస్ వేళ ట్రంప్ సంచలన నిర్ణయం..
అల్ట్రా-హై-స్పీడ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ప్రొపల్షన్, హై-ఫీల్డ్ సూపర్ కండక్టింగ్ అయస్కాంతాల వంటి సంక్లిష్ట సాంకేతిక సవాళ్లను అధిగమించడం ద్వారా చైనా ఈ ఘనత సాధించింది. ఈ విజయం భవిష్యత్తులో భూమిపై ప్రయాణ వేగాన్ని పూర్తిగా మార్చివేయనుంది. రానున్న రోజుల్లో ట్రాన్స్ పోర్టేషన్ రంగంలో ఇది పెద్ద మార్పులకు దారితీస్తుందని, గతంలో మాదిరిగా ప్రజలకు గంటల తరబడి ప్రయాణాలు ఉండబోవని నిపుణులు అంచనా వేస్తున్నారు.
