క్రిస్మస్ వేళ ట్రంప్ సంచలన నిర్ణయం.. నైజీరియాలో ఇస్లామిక్ స్టేట్ స్థావరాలు ధ్వంసం

క్రిస్మస్ వేళ ట్రంప్ సంచలన నిర్ణయం.. నైజీరియాలో ఇస్లామిక్ స్టేట్ స్థావరాలు ధ్వంసం

నైజీరియాలో తిష్టవేసిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులే లక్ష్యంగా అమెరికా దళాలు విరుచుకుపడ్డాయి. క్రిస్మస్ పండుగ వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో జరిగిన ఈ మెరుపు దాడులు అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి. 

నైజీరియాలోని వాయువ్య ప్రాంతంలో క్రిస్టియన్లపై జరుగుతున్న దాడులను తీవ్రంగా పరిగణించిన ట్రంప్, ఉగ్రవాదులకు గతంలోనే గట్టి హెచ్చరికలు జారీ చేశారు. క్రిస్టియన్ల ఊచకోత ఆపకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. చెప్పినట్లుగానే, గురువారం రాత్రి అమెరికా సైన్యం 'పర్ఫెక్ట్' ఎయిర్ స్ట్రైక్స్‌తో ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ విషయాన్ని ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' వేదికగా ధృవీకరించారు. తన నాయకత్వంలో తీవ్రవాదం వర్ధిల్లడానికి వీల్లేదని స్పష్టం చేశారు.

గత కొంతకాలంగా నైజీరియాలో బోకో హరామ్, ఐఎస్ వంటి ఉగ్రవాద ముఠాలు హింసను ప్రేరేపిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర నైజీరియాలో మతపరమైన దాడులు పెరుగుతున్నాయనే ఆందోళనల నేపథ్యంలో.. అమెరికా ఇటీవల నైజీరియాను "ప్రత్యేక ఆందోళన కలిగించే దేశం"గా ప్రకటించింది. క్రైస్తవులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఇప్పటికే పలువురు నైజీరియా అధికారులపై అమెరికా వీసా ఆంక్షలు కూడా విధించింది.

మరోవైపు నైజీరియా అధ్యక్షుడు బోలా టినుబు క్రిస్మస్ సందర్భంగా దేశ ప్రజలకు భరోసా ఇచ్చారు. నైజీరియాలో మత స్వేచ్ఛను కాపాడతామని, అందరు పౌరుల రక్షణకు కట్టుబడి ఉన్నామని లేఖ ద్వారా తెలిపారు. అయితే కేవలం క్రైస్తవులనే లక్ష్యంగా చేసుకుంటున్నారనే వాదనను నైజీరియా ప్రభుత్వం తోసిపుచ్చింది. ఉగ్రవాదులు మతంతో సంబంధం లేకుండా అందరిపై దాడులు చేస్తున్నారని, ఇది సంక్లిష్టమైన భద్రతా సమస్య అని పేర్కొంది.

అయితే ప్రస్తుతం నైజీరియా విషయంలో ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికా విదేశాంగ విధానంలో దూకుడును సూచిస్తోంది. క్రిస్మస్ వేళ జరిగిన ఈ దాడులు ఉగ్రవాద గ్రూపులకు గట్టి సంకేతాన్ని పంపాయి. "దేవుడు మన సైన్యాన్ని ఆశీర్వదించుగాక.. అందరికీ మెర్రీ క్రిస్మస్" అంటూ ట్రంప్ తన సందేశాన్ని ముగించారు. అలాగే మరణించిన ఉగ్రవాదులకు కూడా ఈ సందర్భంగా ట్రంప్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.