లడఖ్ సరిహద్దు వివాదంపై భారత మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవణె రాసిన (ప్రచురితం కాని) పుస్తకం పార్లమెంట్‌లో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. జనరల్ నరవణె తన పదవీకాలంలోని అనుభవాలతో ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ అనే పేరుతో ఓ పుస్తకాన్ని రాశారు. 2020లో లడఖ్‌లోని గల్వాన్ లోయలో భారత్-–చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణల గురించి ఇందులో కీలక విషయాలు ఉన్నట్లు సమాచారం. అయితే, ఈ పుస్తకం ఇంకా అధికారికంగా ప్రచురణ కాలేదు. పార్లమెంట్లో ఈ పుస్తకంపై వివాదం రేగడంతో ‘ఎక్స్’ సాక్షిగా నరవణె స్పందించారు.
ఈ పుస్తకం పబ్లిషింగ్ హక్కులు దక్కించుకున్న పెంగ్వింన్ ఇండియా విడుదల చేసిన స్టేట్మెంట్ను ఆయన షేర్ చేశారు. ఈ బుక్ పబ్లిషింగ్కు వెళ్లలేదని తమ ప్రకటనలో పెంగ్వింన్ ఇండియా స్పష్టం చేసింది. ఈ బుక్ కాపీలు ప్రింట్ లేదా డిజిటల్ ఫామ్లో కూడా పబ్లిష్ కాలేదని.. అందుబాటులో లేవని తెలిపింది. ఈ బుక్ కాపీలను ఏ ఫార్మాట్లో అయినా అందుబాటులో ఉంచితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ విషయాన్ని పెంగ్విన్ ఇండియా ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేయగా ఈ పోస్ట్ను మనోజ్ నరవణె షేర్ చేశారు. ఈ బుక్ స్టేటస్ ఇదీ అని ఆయన పోస్ట్లో మెన్షన్ చేశారు.
‘‘ఈ బుక్ లేదని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. కానీ చూడండి. ఆ బుక్ విదేశాల్లో పబ్లిష్ అయింది.. ఇదిగో ఆ బుక్ ప్రింటెడ్ కాపీ..” అంటూ పార్లమెంట్ దగ్గర రాహుల్ గాంధీ ఆ పుస్తకాన్ని మీడియాకు చూపారు. ఆర్మీ మాజీ చీఫ్ నరవణె రాసిన ‘‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకం విదేశాల్లో పబ్లిష్ అయిందని రాహుల్ గాంధీ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ‘ఇది విదేశాల్లో అందుబాటులో ఉంది. ఈ బుక్ విదేశాల్లో పబ్లిష్ అయిందని అనుకుంటున్నా. ఇప్పుడు నా చేతిలోని ఈ బుక్ ఎక్కడి నుంచి వచ్చిందన్నది మీరు ఊహించుకోవచ్చు’ అని ఆయన హింట్ ఇచ్చారు.
కాగా, ఆర్మీ మాజీ చీఫ్ ఎంఎం నరవణె రాసిన ‘‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ బుక్ 2024 ఏప్రిల్లో విడుదల కావాల్సి ఉండగా, ఆ పుస్తకానికి రక్షణ శాఖ ఆమోదం లభించలేదు. దీంతో ఈ బుక్‌ను పెంగ్విన్ పబ్లిషర్స్ సంస్థ మన దేశంలో అధికారికంగా పబ్లిష్ చేయలేదు. దీనిపై నరవణె గతంలో స్పందిస్తూ.. తాను బుక్ రాసి పెంగ్విన్ సంస్థకు ఇచ్చానని, రక్షణ శాఖ అనుమతి పొందడం ఆ సంస్థ బాధ్యతేనని చెప్పారు.
This is the status of the book. https://t.co/atLtwhJvl0
— Manoj Naravane (@ManojNaravane) February 10, 2026
