రూటు మార్చేసిన మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్.. ఇప్పుడు అందరి చూపు అటువైపే

రూటు మార్చేసిన మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్.. ఇప్పుడు అందరి చూపు అటువైపే

స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ.. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు మాత్రం వెనకడుగు వేయడం లేదు. AMFI విడుదల చేసిన జనవరి 2026 లెక్కలు దేశంలో మారుతున్న ఇన్వెస్ట్మెంట్ ట్రెండ్స్ ని స్పష్టం చేస్తున్నాయి. గత డిసెంబర్‌తో పోలిస్తే ఈక్విటీ ఫండ్లలోకి పెట్టుబడులు స్వల్పంగా తగ్గినప్పటికీ.. ఓవరాల్‌గా మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ రూ.81.01 లక్షల కోట్ల భారీ ఆస్తులతో కళకళలాడుతోంది.

ఈక్విటీ కంటే గోల్డ్ ఈటీఎఫ్‌ల వైపు మొగ్గు: 

సాధారణంగా ఈక్విటీ ఫండ్లకు ఉండే క్రేజ్ జనవరిలో కొంత తగ్గింది. ఈక్విటీ ఇన్-ఫ్లోలు 14 శాతం తగ్గి రూ.24వేల 029 కోట్లకు పరిమితమయ్యాయి. అయితే ఇన్వెస్టర్ల ఆకర్షణ ఇప్పుడు మెరుస్తున్న బంగారం, వెండి వైపు మళ్లింది. జనవరిలో గోల్డ్ ETFsలోకి ఏకంగా రూ.24వేల 040 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇది డిసెంబర్ నాటి రూ.11వేల 647 కోట్లతో పోలిస్తే రెట్టింపు కంటే ఎక్కువ. మార్కెట్ అనిశ్చితి వల్ల ఇన్వెస్టర్లు సురక్షితమైన బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారని టాటా అసెట్ మేనేజ్‌మెంట్ నిపుణుడు ఆనంద్ వరదరాజన్ పేర్కొన్నారు.

లార్జ్ క్యాప్ ఫండ్స్ వైపు చూపు: 

మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్లలో ప్రాఫిట్ బుకింగ్ కారణంగా పెట్టుబడుల వేగం తగ్గింది. మిడ్ క్యాప్ ఇన్-ఫ్లోలు రూ.4వేల176 కోట్ల నుంచి రూ.3వేల185 కోట్లకు, స్మాల్ క్యాప్స్ రూ.3వేల 824 కోట్ల నుండి రూ.2వేల 942 కోట్లకు పడిపోయాయి. కానీ రిస్క్ తక్కువగా ఉండే లార్జ్ క్యాప్ ఫండ్లలో మాత్రం ఇన్వెస్టర్లు రూ.2వేల 005 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఇది గత నెల కంటే మెరుగుపడటం గమనార్హం. అంటే ఇన్వెస్టర్లు ఇప్పుడు దూకుడు కంటే జాగ్రత్తకే ప్రాధాన్యత ఇస్తున్నారని వారి ప్రవర్తన చెబుతోంది.

డెట్ ఫండ్లలో భారీ రికవరీ: 

డిసెంబర్‌లో భారీగా విత్ డ్రా అయిన డెట్ ఫండ్స్.. జనవరిలో అద్భుతమైన రికవరీ చేశాయి. ఏకంగా రూ.74వేల 827 కోట్ల పెట్టుబడులు ఈ విభాగంలోకి వచ్చాయి. ముఖ్యంగా కార్పొరేట్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు తమ దగ్గర ఉన్న ఎక్స్‌ట్రా డబ్బును తిరిగి డెట్ ఫండ్లలోకి మళ్లించారు. ఇక హైబ్రిడ్ ఫండ్స్ లోకి కూడా పెట్టుబడులు రూ.17వేల 356 కోట్లకు పెరిగాయి.

ఇన్వెస్టర్ల పెట్టుబడి తీరుల్లో వచ్చిన ముఖ్యమైన మార్పులను గమనిస్తే..
* ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్: ఈ విభాగం ఇన్వెస్టర్ల హాట్ ఫేవరెట్‌గా నిలుస్తోంది.
* SIPలు: సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ల సంఖ్య ప్రతి నెలా పెరుగుతూనే ఉంది.
* ఎగ్జిట్స్: ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ నుంచి రూ.594 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు ఇన్వెస్టర్లు. 

మొత్తానికి ఇన్వెస్టర్లు ఇప్పుడు కేవలం షేర్ మార్కెట్‌నే నమ్ముకోకుండా బంగారం, డెట్ ఫండ్స్, మల్టీ అసెట్ ఫండ్స్ ద్వారా తమ పోర్ట్‌ఫోలియోను నిర్మించుకుంటూ అప్రమత్తంగా ముందుకు సాగుతున్నారు. సురక్షితమైన లాభాల కోసం అన్వేషిస్తున్న వారికి ఇప్పుడు 'గోల్డ్', 'హైబ్రిడ్ ఫండ్స్' బెస్ట్ ఎంపికలుగా మారాయి.