శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శనం కోసం దేశం నలుమూలల నుండి భక్తులు వస్తున్న క్రమంలో శ్రీశైలంలో భక్తులతో రద్దీ పెరిగింది. ఈ క్రమంలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొనిశ్రీశైలంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు కర్నూల్ రేంజ్ డిఐజి కోయ ప్రవీణ్. డీజీఐ ప్రవీణ్ తో పాటు నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ కూడా భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ క్రమంలో గుడి పరిసర ప్రాంతాలు, గుడి బయట ఏర్పాటుచేసిన క్యూలైన్లు మొదలుకొని స్వామి అమ్మవారి దర్శనం తర్వాత నిష్క్రమించే మార్గం వరకు ఏర్పాటు చేసిన క్యూలైన్లను, శివ స్వాములు వేచి ఉండే చంద్రావతి కళ్యాణమండపం, ప్రత్యేకంగా వారికి ఏర్పాటు చేసిన క్యూలైన్లు, పార్కింగ్ ప్రదేశాలను స్వయంగా పరిశీలించడంతోపాటు CC కెమెరాల ద్వారా భక్తుల రద్దీని, భద్రత ఏర్పాట్లను పరిశీలించారు.
►ALSO READ | శ్రీశైలంలో తొక్కిసలాటపై సీఎం చంద్రబాబు సీరియస్... మంత్రులకు కీలక ఆదేశాలు..
భక్తుల భద్రత దృష్ట్యా ప్రతి ఒక్కరిని తనిఖీ చేయాలని గుడి ప్రవేశ, నిష్క్రమణ ప్రాంతాలలో డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేసుకోవాలని, విధినిర్వహణలో ఉన్న సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ... ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని,ఏదైనా సమస్య ఉంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సిబ్బందికి అధికారులకు పలు సూచనలు చేశారు.
స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తులు ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు పోలీసుల సూచనలు పాటిస్తూ తమ వాహనాలను ఇతరులకు ఆటంకం లేకుండా పార్కింగ్ ప్రదేశాలలో మాత్రమే పార్కింగ్ చేసుకోవాలని కోరారు. రోడ్డుకిరువైపులా వాహనాలను నిలుపు రాదని విజ్ఞప్తి చేశారు అధికారులు.
