శ్రీశైలంలో శివమాల దారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో ఏపీలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనంటూ విమర్శిస్తోంది ప్రతిపక్ష వైసీపీ. ఈ క్రమంలో శ్రీశైలం తొక్కిసలాట ఘటనపై సీరియస్ అయ్యారు సీఎం చంద్రబాబు.
మంగళవారం ( ఫిబ్రవరి 10 ) మంత్రులు, ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఇతర అధికారులతో ఢిల్లీ నుంచి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ మంత్రులు, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు.
దీక్షలు, మాలదారులను అగౌరవపరచద్దు:
శివరాత్రి సమీపిస్తున్న క్రమంలో శ్రీశైలం సహా వివిధ శివాలయాల్లో భక్తుల రద్దీ, వసతులపై కీలక ఆదేశాలు జారీ చేశారు చంద్రబాబు. దీక్షలు, మాలధారణలతో ఎంతో కష్టపడి ఆలయానికి చేరుకునే భక్తులకు ఇబ్బంది కలిగేలా, అగౌరపరిచేలా ఎవరూ వ్యవహరించ కూడదని ఆదేశించారు చంద్రబాబు. రోజు రోజుకూ దేవాలయాల్లో పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
శ్రీశైలం బ్రహ్మోత్సవాలపై ఫోకస్:
శివరాత్రి నాటికి శ్రీశైలంలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్న క్రమంలో పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు చంద్రబాబు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం, హోం మంత్రి అనిత ప్రత్యేక శ్రద్దతో ఏర్పాట్లు, వసతులపై అధికారులతో పర్యవేక్షించాలని సూచించారు.
భక్తులకు ఇబ్బంది కలగకుండా, దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి త్వరితగతిన దర్శనం పూర్తయ్యేలా, వసతి లభించేలా కార్యచరణ అమలు చేయాలని ఆదేశించారు.శివరాత్రి పర్వదినం వంటి సందర్భాల్లో అన్ని విభాగాలు పూర్తి సమన్వయంతో పనిచేసేలా ఇప్పటి నుంచే పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు.
