- అగ్రికల్చర్ యంత్రాలు, పనిముట్లను ఉబరైజ్ చేసే
- ఆలోచనలో రాష్ట్ర వ్యవసాయ శాఖ
- ఇందుకోసం ‘ఫామ్ యాప్’ అభివృద్ధి చేసేందుకు కసరత్తు
- ఏపీలో అమలవుతున్న విధానం
హైదరాబాద్, వెలుగు: ఓలా, ఉబర్ టాక్సీల తరహాలోనే ఇకపై రైతులు తమ పొలం పనులకు అవసరమైన యంత్రాలను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, డ్రోన్ల కోసం గంటల కొద్దీ వేచి చూడాల్సిన అవసరం లేకుండా, నేరుగా ఫోన్ ద్వారా ఆర్డర్ ఇస్తే చాలు.. వచ్చి పొలం పనులు చేసి వెళ్తారు. యూరియా యాప్ సక్సెస్ ఇచ్చిన జోష్‌తో రాష్ట్ర సర్కారు వినూత్న ‘డిజిటల్ అగ్రికల్చర్’ వ్యవస్థను తీసుకొస్తున్నది. ప్రతి సీజన్‌లో రైతులు పడుతున్న కష్టాలకు చెక్ పెట్టేందుకు వ్యవసాయ శాఖ సాగు పనులను ‘ఉబరైజ్’ చేస్తూ.. సరికొత్త ‘ఫామ్ యాప్’ను రూపొందించేందుకు కసరత్తు మొదలెట్టింది. ఈ యాప్ అందుబాటులోకి వస్తే.. ప్రయాణానికి టాక్సీ బుక్ చేసుకున్నంత ఈజీగా రైతులకు సాగు యంత్రాలు కూడా దొరకనున్నాయి. ఒక్క క్లిక్‌తో మీ ఊరిలో అందుబాటులో ఉన్న ట్రాక్టర్లు, డ్రోన్ల వివరాలు కళ్లముందు ప్రత్యక్షం కానున్నాయి. నాట్లు, పంట కోతలలాంటి తిప్పలు తప్పేలా యంత్రాల సేవలన్నీ డిజిటలైజ్ కానున్నాయి.
ఇదివరకే ప్రయత్నాలు..
పంటల సీజన్‌లో యంత్రాల కొరతతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు ‘ఫామ్ యాప్’ఉపయోగపడనున్నది. వానాకాలం, యాసంగి సీజన్లలో ఒకేసారి పంట కోతలు ప్రారంభమైతే హార్వెస్టర్లు, మక్కజొన్న కోసే మిషన్లు, కంకులు తీసే పరికరాలకు డిమాండ్ పెరుగుతుంది. ఫలితంగా రైతులు యంత్రాల కోసం ఎదురుచూడాల్సి వస్తున్నది. ఈ సమస్యకు పరిష్కారంగా వ్యవసాయ శాఖ యాప్‌ను అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నది. గత ఐదారేండ్లుగా ఈ దిశగా ప్రయత్నాలు సాగుతున్నప్పటికీ, ఇప్పుడు కార్యరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూరియా యాప్ విజయవంతమైన ఈ నేపథ్యంలో ‘ఫామ్ యాప్’ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ యాప్ ద్వారా రైతులు తమ సెల్‌ఫోన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని, అవసరమైన యంత్రాల వివరాలు చూడవ చ్చు. అందుబాటులో ఉన్న యంత్రాలు, డ్రోన్లు కనిపిస్తాయి. బుకింగ్ చేస్తే యజమాని వివరాలు వెంటనే అందుతాయి. సమయం నమోదు చేస్తే పొలం వద్దకే యంత్రం వచ్చి, మందులు స్ప్రే చేయడం, దున్నడంలాంటి పనులు చేస్తుంది. ‘యుటిలైజేషన్ ఆఫ్ కిసాన్ డ్రోన్స్’ పేరుతో ఇప్పటికే డ్రోన్ సేవలను ఏపీ ప్రారంభించింది. ఈ యంత్రాలను బుక్ చేసుకోవడానికి అక్కడ ప్రత్యేకమైన మొబైల్ అప్లికేషన్‌ను వాడుతున్నారు. ఇదే పద్ధతిని తెలంగాణలో అంతకంటే మెరుగైన ‘ఫామ్ యాప్’ను రూపొందించాలని చూస్తున్నది.
రైతులకు ఉపయోగం..
ఈ యాప్ అందుబాటులోకి వస్తే రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. పశువులు, కూలీలపై ఆధారపడకుండా ట్రాక్టర్లు, టిల్లర్లు, డ్రోన్లను సులువుగా ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం గ్రామాల్లో వ్యవసాయ కూలీల కొరత తీవ్రంగా ఉంది. ముఖ్యంగా నాట్లు, కోతల సమయంలో కూలీలు దొరక్క పంటలు పాడైపోయే పరిస్థితి నెలకొన్నది. ఈ యాప్ ద్వారా కూలీల కోసం గంటల కొద్దీ నిరీక్షించే పని తప్పుతుంది. పశువులతో దున్నడంలాంటి పాత పద్ధతుల కంటే, యంత్రాలతో పనులు వేగంగా పూర్తి కావడంతో రైతుకు విలువైన సమయం ఆదా అవుతుంది. సాధారణంగా డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు యంత్రాల యజమానులు ఇష్టానుసారంగా అద్దెలు వసూలు చేస్తుంటారు. ఈ యాప్ ద్వారా ధరల పారదర్శకత పెరుగుతుంది. ప్రభుత్వం నిర్ణయించిన లేదా మార్కెట్‌లో ఉన్న సరసమైన ధరకే యంత్రాలు లభిస్తాయి. దళారీ వ్యవస్థ తగ్గి, రైతుపై అదనపు ఆర్థిక భారం తప్పుతుంది. డ్రోన్లు, ఆధునిక టిల్లర్ల వాడకం వల్ల ఎరువులు, పురుగుల మందుల వినియోగం శాస్త్రీయంగా జరుగుతుంది. ఏ మొక్కకు ఎంత అవసరమో అంతే మందును డ్రోన్ పిచికారీ చేస్తుంది. దీనివల్ల వృథా తగ్గడమే కాకుండా, భూసారం దెబ్బతినకుండా ఉంటుంది. రైతు పొలం దగ్గరే ఉండాల్సిన అవసరం లేదు. ఇంటి వద్ద నుంచే లేదా వేరే గ్రామంలో ఉన్నా కూడా తన ఫోన్ ద్వారా మరుసటి రోజుకు కావాల్సిన యంత్రాన్ని షెడ్యూల్ చేసుకోవచ్చు. ఈ డిజిటల్ నెట్‌వర్క్ వల్ల యంత్రం ఎక్కడ ఉంది? ఎప్పుడు వస్తుంది? అనే లైవ్ అప్‌డేట్స్ కూడా రైతుకు అందుతాయి. వ్యవసాయ శాఖ సిబ్బంది (ఏఈవోలు) ఈ యాప్ పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తారు. ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తినా లేదా బుకింగ్‌లో ఇబ్బందులు ఉన్నా వారు తక్షణమే స్పందిస్తారు. తద్వారా టెక్నాలజీపై అవగాహన లేని రైతులకు కూడా క్షేత్రస్థాయిలో భరోసా లభిస్తుంది.
