ఇస్లామాబాద్: బంగ్లాదేశ్ కోసమే టీ20 వరల్డ్ కప్‌లో ఇండియాతో మ్యాచ్ బహిష్కరించాలని నిర్ణయించుకున్నామని.. ఇందులో మా స్వలాభం ఏమిలేదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ నీతులు వల్లించాడు. పాక్ కోసం ఐసీసీని ఏమి డిమాండ్ చేయలేదని.. ప్రపంచ కప్ నుంచి బహిష్కరించబడిన బంగ్లాదేశ్ కోసమే ఈ స్టాండ్ తీసుకున్నామని ప్రగల్భాలు పలికారు.
భద్రతాపరమైన కారణాలతో ఇండియాలో పర్యటించేందుకు నిరాకరించిన బంగ్లాదేశ్‌ను వరల్డ్ కప్ నుంచి ఐసీసీ తొలగించిన విషయం తెలిసిందే. బంగ్లాను భర్తరఫ్ చేయడంతో ఆ దేశానికి మద్దతుగా.. టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా 2026, ఫిబ్రవరి 15న ఇండియాతో జరిగే మ్యాచ్‌ను బాయ్ కాట్ చేయాలని పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఐసీసీ, శ్రీలంక, బంగ్లా క్రికెట్ బోర్డు అఫిషియల్స్ రంగంలోకి దిగి చర్చలు జరపడంతో పాక్ మనసు మార్చుకుంది.
వరల్డ్ కప్‌లో యధావిధిగా ఇండియాతో మ్యాచ్ ఆడేందుకు పాక్ ఓకే చెప్పింది. ఈ అంశంపై పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ మీడియాతో మాట్లాడుతూ.. వరల్డ్ కప్‌లో ఇండియాతో మ్యాచ్ బాయ్ కాట్ చేయాలనే నిర్ణయం కేవలం బంగ్లాదేశ్ కోసమేనని బీరాలు పలికారు. ఇందులో పాక్ సొంత ప్రయోజనం ఏమి లేదని నీతులు చెప్పారు. మా నిర్ణయంతో బంగ్లాదేశ్‌కు న్యాయం జరిగిందని.. అందుకే ఇండియాతో మ్యాచ్ ఆడామని బంగ్లాదేశ్ కోరిందని గొప్పులు చెప్పుకున్నారు.
వాస్తవానికి వరల్డ్ కప్ లో ఇండియాతో మ్యాచ్ ఆడేందుకు పాక్ ఐసీసీకి మూడు డిమాండ్లు పెట్టింది. కానీ ఈ మూడు డిమాండ్లను ఐసీసీ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఈ క్రమంలో నఖ్వీ వ్యాఖ్యలపై క్రికెట్ ఫ్యాన్స్ నెట్టింట సెటైర్లు వేస్తున్నారు. మీ వేషాలు తగలెయ్యా.. ప్రపంచం ముందు పరువు పొగుట్టుకున్నా పోజులు కొట్టడం ఒక్క మీకే చెల్లతుందంటూ పాక్ జట్టును ఏకిపారేస్తున్నారు.
