రష్యాలో భారత విద్యార్థులపై పెరుగుతున్న జాతి వివక్ష.. భారీగా పెరుగుతున్న కంప్లెయింట్స్

రష్యాలో భారత విద్యార్థులపై పెరుగుతున్న జాతి వివక్ష.. భారీగా పెరుగుతున్న కంప్లెయింట్స్

రష్యాలోని ఉఫా నగరంలో నలుగురు భారతీయ విద్యార్థులపై జరిగిన కత్తిపోట్ల దాడి యావత్ భారత దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే ఈ దాడి ఒక ఆకస్మిక ఘటన మాత్రమే కాదు.. రష్యాలో భారతీయ విద్యార్థులు ఎదుర్కొంటున్న దారుణ పరిస్థితులకు నిదర్శనమని కేంద్ర విదేశాంగ శాఖ లెక్కలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా భారతీయ విద్యార్థులు ఎదుర్కొంటున్న వేధింపులు, జాతి వివక్ష ఫిర్యాదుల్లో సగానికి పైగా ఒక్క రష్యా నుండే రావడం పరిస్థితుల తీవ్రతను చెబుతోంది.

2025లో ప్రపంచవ్యాప్తంగా 196 దేశాల్లోని భారత విద్యార్థుల నుంచి సుమారు 350 ఫిర్యాదులు రాగా.. అందులో 201 ఒక్క రష్యా నుండే వచ్చాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. గత మూడేళ్లలో ఈ సంఖ్య భయంకరంగా పెరిగింది. 2023లో 68, 2024లో 78 ఉన్న కంప్లెయింట్స్.. 2025 నాటికి ఒక్కసారిగా 201కి చేరుకుంది. తక్కువ ఫీజులు, సులభమైన అడ్మిషన్ల కారణంగా తెలుగు రాష్ట్రాలతో పాటు రాజస్థాన్, గుజరాత్ వంటి ప్రాంతాల నుంచి విద్యార్థులు రష్యాకు వెళ్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అక్కడ వారికి రక్షణ కరువైందని ఈ డేటా చెబుతోంది. దీంతో 57 శాతం కంప్లెయింట్స్ రష్యాలోని విద్యార్థుల నుంచే వస్తున్నాయని తేలింది.

రష్యాలోని విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్న విద్యార్థులు నిత్యం జాతి వివక్షను, మానసిక వేధింపులను ఎదుర్కొంటున్నారు. వీసా సమస్యలు వస్తాయనో లేదా కాలేజీ నుంచి బహిష్కరిస్తారనే భయంతో చాలా మంది విద్యార్థులు తమపై జరుగుతున్న అన్యాయాన్ని బయటకు చెప్పుకోలేకపోతున్నారు. దీనికి తోడు కొన్ని యూనివర్సిటీలు అడ్మిషన్ల నిబంధనలను అతిక్రమించి, పరిమితికి మించి విద్యార్థులను చేర్చుకుని, చివరి సంవత్సరంలో వారిని ఏదో ఒక సాకుతో బయటకు పంపుతున్నాయని ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఆరోపిస్తోంది.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యాలో సేఫ్టీ మరింత దిగజారింది. ఈ క్రమంలో భారతీయ విద్యార్థులు ఇప్పుడు రష్యాకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. రష్యాకు ప్రత్యామ్నాయంగా కజకిస్థాన్, కిర్గిజిస్థాన్ వంటి దేశాలను ఎంచుకుంటున్నారు. భారత ప్రభుత్వం విదేశాల్లోని రాయబార కార్యాలయాల ద్వారా విద్యార్థులకు అండగా ఉంటామని చెబుతున్నప్పటికీ.. ఉఫా దాడి లాంటి ఘటనలు క్షేత్రస్థాయిలో ఉన్న భయంకర పరిస్థితులను కళ్లకు కడుతున్నాయి. రష్యా ఇండియా మధ్య స్నేహం ఉన్నప్పటికీ పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయంటే ఆశ్చర్యం వేస్తోందని నెటిజన్లు దీనిపై స్పందిస్తున్నారు.