30 కోట్ల మందితో 12న భారత్ బంద్ : ఎందుకో తెలుసుకోండి..!

 30 కోట్ల మందితో 12న భారత్ బంద్ : ఎందుకో తెలుసుకోండి..!

కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న దేశవ్యాప్త భారత్ బంద్(సార్వత్రిక సమ్మె)కి పిలిపునిచ్చారు. ఈ మేరకు 10 ప్రధాన కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక సోమవారం మరోసారి స్పష్టం చేసింది. ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ ఈ సమ్మె జరుగుతోంది.

30 కోట్ల మందితో సమ్మె
ఈ బంద్ లో ఈసారి దాదాపు 30 కోట్ల మంది కార్మికులు పాల్గొంటారని అంచనా. అలాగే 2025 జూలైలో జరిగిన నిరసన కంటే పెద్దదిగా ఉండబోతోంది. దేశవ్యాప్తంగా సుమారు 600 జిల్లాల్లో ఈ సమ్మె ప్రభావం కనిపిస్తుందని యూనియన్ నాయకురాలు అమర్‌జీత్ కౌర్ తెలిపారు. ఒడిశా, అస్సాం వంటి రాష్ట్రాల్లో పూర్తి బంద్ జరిగే అవకాశం ఉంది. సంయుక్త కిసాన్ మోర్చా (SKM) ఈ సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటించింది. విద్యార్థి, యువజన సంఘాలు కూడా ఈ నిరసనల్లో పాల్గొననుంది. 

సమ్మె డిమాండ్లు ఏంటంటే :
కొత్తగా తెచ్చిన నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేయాలి. అలాగే విత్తన బిల్లు, విద్యుత్ సవరణ బిల్లులను వెనక్కి తీసుకోవాలి. ఇంకా ప్రైవేటీకరణను ఆపాలి. ఉపాధి హామీ పథకానికి (MGNREGA) నిధులు పెంచాలని  డిమాండ్ చేస్తున్నారు.

ఆపిల్ రైతుల ఆందోళన
ఈ సమ్మెలో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఆపిల్ రైతులు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. వీరు ఢిల్లీ మార్చ్ కు కూడా ప్లాన్ చేస్తున్నారు. అమెరికా, న్యూజిలాండ్ నుంచి వచ్చే ఆపిల్స్‌పై దిగుమతి సుంకం (Import Duty) తగ్గించడం వల్ల  వ్యాపారం దెబ్బతింటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. విదేశీ కార్పొరేట్ సంస్థల పోటీని తట్టుకోలేమని  హెచ్చరిస్తున్నారు. దాదాపు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు, పారిశ్రామిక ప్రాంతాల్లో ఇప్పటికే సమ్మె నోటీసులు ఇవ్వగా... సమ్మె సన్నాహాలు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయని యూనియన్లు తెలిపాయి.