రూ.54 వేల కోట్లు దోచుకుంటే ఏం చేస్తున్నరు.?..బ్యాంకులపై సుప్రీంకోర్టు ఫైర్

రూ.54 వేల కోట్లు దోచుకుంటే ఏం చేస్తున్నరు.?..బ్యాంకులపై సుప్రీంకోర్టు ఫైర్
  • బ్యాంకులపై సుప్రీంకోర్టు ఫైర్  
  • బ్యాంకు ఆఫీసర్ల నిర్లక్ష్యం, అక్రమార్కులతో
  • కుమ్మక్కవడంతోనే భారీ మోసాలు
  • ఆర్బీఐ, బ్యాంకులు, టెలికాం శాఖతో కలిసి
  • ఎస్​వోపీ రూపొందించాలని కేంద్రానికి ఆదేశం

న్యూఢిల్లీ:  డిజిటల్ మోసాలు విపరీతంగా పెరిగిపోతుండడంపై సుప్రీం కోర్టు బ్యాంకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సామాన్యుల నుంచి నేరగాళ్లు రూ.54 వేల కోట్లకు పైగా సొమ్ము దోచుకోవడంపై.. ఇది కేవలం నేరం కాదు ‘పచ్చి దోపిడీ’ అని ఫైర్​అయింది. ఇలాంటి మోసాలను అరికట్టడానికి ఆర్బీఐ, బ్యాంకులు, టెలికాం శాఖలతో సంప్రదించి ఒక పక్కా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్​వోపీ) రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

ఈ అంశాన్ని విచారించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్​మాల్య బాగ్చీ, జస్టిస్ ఎన్‌‌వీ అంజారియాతో కూడిన బెంచ్ దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మొత్తం పలు చిన్న రాష్ట్రాల బడ్జెట్ కంటే ఎక్కువ అని, బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం లేదా కుమ్మక్కవడంతోనే ఇలాంటి భారీ మోసాలు జరుగుతున్నాయని పేర్కొంది. బ్యాంకులు ఖాతాదారుల ట్రస్టీలుగా ఉండి, వారి డబ్బును కాపాడాలి. కానీ వ్యాపార ధోరణిలో ఉండి, నేరగాళ్లు ఈజీగా మనీ ట్రాన్స్​ఫర్​ చేసే వేదికలుగా మారుతున్నాయని విమర్శించింది. పెన్షనర్ ఖాతా నుంచి సాధారణంగా రూ.15–20 వేలు తీసుకునేవాడు ఒక్కసారిగా రూ.50 లక్షలు లేదా కోటి రూపాయలు విత్‌‌డ్రా చేస్తే, బ్యాంకు ఏఐ టూల్స్ ఎందుకు అలర్ట్ చేయడం లేదని సీజేఐ ప్రశ్నించారు. డిజిటల్ అరెస్ట్ మోసాలు పెరిగిపోతున్నాయని, నేరగాళ్లు.. పోలీసులు, కోర్టు అధికారులుగా నటించి ఆడియో-, వీడియో కాల్స్‌‌తో బెదిరించి డబ్బు వసూలు చేస్తున్నారని వివరించింది. ఆర్బీఐ ఇప్పటికే ఎస్​వోపీ రూపొందించి, అనుమానాస్పద లావాదేవీలపై డెబిట్ హోల్డ్ వేయాలని సూచించిందని అటార్నీ జనరల్ కోర్టుకు తెలిపారు. దాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని హోం మంత్రిత్వ శాఖకు ఆదేశాలు కోర్టు ఇచ్చింది. డిజిటల్ అరెస్ట్ కేసులను గుర్తించి సీబీఐ విచారణకు గుజరాత్, ఢిల్లీ ప్రభుత్వాలు అనుమతి ఇవ్వాలని చెప్పింది. బాధితులకు పరిహారం ఇచ్చే ఫ్రేమ్‌‌వర్క్ రూపొందించడానికి ఆర్బీఐ, డాట్‌‌తో సమావేశం నిర్వహించాలని ఆదేశించింది.ఈ కేసు నాలుగు వారాల తర్వాత మళ్లీ విచారిస్తామని పేర్కొంటూ వాయిదా వేసింది.