హైదరాబాద్: అనుమానంతో భార్యను దారుణంగా హత్య చేశాడు భర్త. అర్ధరాత్రి భార్యపై దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లోని నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా హుజుర్‌నగర్‌కి చెందిన వెంకటేష్, త్రివేణి భార్యభర్తలు. వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.
మొదట్లో బాగానే ఉన్న వెంకటేష్‌కు కొంతకాలం తర్వాత భార్య త్రివేణిపై అనుమానం మొదలైంది. అనుమానంతో తరుచూ భార్యను వేధింపులకు గురి చేస్తున్నాడు. భర్త వేధింపులు తాళలేక త్రివేణి తల్లిగారింటికి వెళ్లిపోయింది. ఇక నుంచి బుద్ధిగా ఉంటానని నమ్మించి త్రివేణిని హైదరాబాద్ తీసుకొచ్చి నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో కాపురం పెట్టాడు వెంకటేష్. ఈ క్రమంలో బుధవారం (డిసెంబర్ 24) అర్ధరాత్రి భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవ జరిగింది.
తీవ్ర ఆగ్రహానికి గురైన వెంకటేష్ భార్యపై దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించి పరార్ అయ్యాడు. త్రివేణి అరుపులు, కేకలు విన్న స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడటంతో ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నల్లకుంట పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న మృతురాలి భర్త వెంకటేష్‌ను 12 గంటల్లోనే పోలీసులు అరెస్ట్ చేశారు.
