గత ఏడాది కాలంగా బంగారం, వెండి ధరల్లో వచ్చిన విపరీతమైన మార్పులు దేశీయ నగల వ్యాపారాన్ని కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా గుజరాత్‌లోని రాజకోట్ నుంచి ముంబైలోని జవేరీ బజార్ వరకు బులియన్ మార్కెట్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రస్తుతం ఈ రంగంపై ఆధారపడిన వ్యాపారులు, కార్మికులతో పాటు సామాన్య కొనుగోలుదారుల జీవితాలు ఎలా తలకిందులయ్యాయో ఇప్పుడు తెలుసుకుందాం..
రాజకోట్‌లో నిలిచిన వెండి వెలుగులు..
ఆసియాలోనే అతిపెద్ద వెండి వ్యాపార కేంద్రంగా పేరొందిన రాజకోట్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. ఒకప్పుడు నెలకు 25-30 టన్నుల వెండిని అమ్మిన వ్యాపారులు.. ఇప్పుడు కనీసం ఒక టన్ను అమ్మడానికి కూడా కష్టపడుతున్నారు. ధరల అస్థిరత వల్ల సుమారు 1.5 లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదంలో పడ్డారని తేలింది. అనేక సంస్థలు కాంట్రాక్ట్ కార్మికులను తొలగించి, కేవలం కోర్ స్టాఫ్‌తోనే నెట్టుకొస్తున్నాయి.
కుప్పకూలిన నమ్మకం.. పేరుకుపోయిన బకాయిలు
సాధారణంగా బులియన్ మార్కెట్ నమ్మకంతో పాటు అప్పుపై నడుస్తుంది. కానీ ఒక్క రోజులోనే వెండి ధర రూ.30వేల వరకు హెచ్చుతగ్గులకు లోనవుతుండటంతో పాత వ్యాపార విధానం కుప్పకూలింది. దీంతో రాజకోట్‌లోని దాదాపు 44 ట్రేడింగ్ సంస్థలు దివాళా తీశాయి. సుమారు రూ.3వేల 500 కోట్ల మేర బకాయిలు నిలిచిపోయాయి. ధరలు పెరగడం వల్ల తయారీదారులు ముడి పదార్థాలను కొనలేకపోతుంటే, అమ్మకాలు లేక హోల్‌సేలర్లు కొత్త ఆర్డర్లు ఇవ్వని పరిస్థితి కొనసాగుతోంది.
ఆకాశాన్నంటిన ధరలు..
2025లో వెండి ధరలు ఏకంగా 160% పెరిగిన సంగతి తెలిసిందే. పారిశ్రామిక వినియోగం, అంతర్జాతీయ భౌగోళిక పరిస్థితులే ఇందుకు కారణం. డిసెంబర్ నెలలోనే వెండి ధర కేజీకి రూ.60వేలు పెరిగి అందరినీ షాక్ కి గురిచేసింది. జనవరి 2026 నాటికి వెండి రూ.4 లక్షలు.. బంగారం రూ.1.83 లక్షల (10 గ్రాములు) గరిష్ట స్థాయిని తాకాయి. ప్రస్తుతం ధరలు స్వల్పంగా తగ్గినప్పటికీ.. రేట్లలో తీవ్రమైన హెచ్చుతగ్గులు కస్టమర్లలో భయాన్ని నింపాయి.
జవేరీ బజార్‌లో నిశ్శబ్దం..
ముంబైలోని ప్రసిద్ధ జవేరీ బజార్‌లో కస్టమర్ల తాకిడి 50% పైగా తగ్గిపోయింది. ఒకప్పుడు బంగారం కొనలేని వారు వెండిని ఎంచుకునేవారు. కానీ ఇప్పుడు వెండి కూడా సామాన్యులకు భారంగా మారిపోవటంతో వ్యాపారాలు వెలవెలబోతున్నాయి. పెళ్లిళ్ల కోసం నగలు కొనేవారు తమ ప్లాన్లను సగానికి తగ్గించుకుంటున్నారు లేదా కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారు. ఇన్వెస్టర్లు కూడా మార్కెట్ ఎప్పుడు స్థిరపడుతుందో తెలియక వేచి చూసే ధోరణిలో ఉన్నారు.
లిక్విడిటీ కష్టాలు: అమ్మాలన్నా కష్టమే!
విచిత్రమైన పరిస్థితి ఏంటంటే.. ధరలు పెరిగినప్పుడు తమ దగ్గరున్న మెటల్ అమ్ముకుందామన్నా వ్యాపారులు కొనడం లేదంట బయట. రిటైలర్ల వద్ద నగదు కొరత ఉండటంతో పాత వెండి, బంగారాన్ని వెనక్కి తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. దీనివల్ల కష్టకాలంలో ఆదుకుంటుంది అనుకున్న బంగారం పెట్టుబడిపై సామాన్యుల్లో నమ్మకం మెల్లగా మసకబారుతోంది. మెుత్తంగా ఈ పరిస్థితులు భారతీయ బులియన్ మార్కెట్లను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.
