Nilave: ప్రేమలో మరో ‘కేజీఎఫ్’.. మ్యూజికల్ మెజిక్ ‘నిలవే’!

Nilave: ప్రేమలో మరో ‘కేజీఎఫ్’.. మ్యూజికల్ మెజిక్ ‘నిలవే’!

ప్రేమకథలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడతారు. అదే కోవలో మనసును తాకే భావోద్వేగాలతో, అద్భుతమైన సంగీతంతో తెరకెక్కిన చిత్రం 'నిలవే'. సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన ఈ చిత్రం, ఫిబ్రవరి 13న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం మాదాపూర్‌లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ చిత్ర యూనిట్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

సునీత ప్రశంసలు.. కీరవాణి అండ

ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ సింగర్ సునీత. ఆమె మాట్లాడుతూ.. ఈ మధ్య కాలంలో అన్నీ ఎమోషన్స్ ఉన్న క్లాసిక్ లవ్ స్టోరీని చూడటం అరుదైపోయింది. 'సఖి', 'ఏ మాయే చేశావే' వంటి ఫీల్ గుడ్ చిత్రాల సరసన 'నిలవే' నిలుస్తుంది. ఆస్కార్ విజేత కీరవాణి కూడా ఈ పాటలు విని ప్రమోషన్ చేయడం సినిమాకు పెద్ద ప్లస్" అని కొనియాడారు.

లవ్ స్టోరీస్ లో 'కేజీఎఫ్' వంటిది!

హీరో సౌమిత్ పోలాడి ఈ చిత్రంపై ధీమా వ్యక్తం చేస్తూ.. యాక్షన్ సినిమాల్లో కేజీఎఫ్ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో, ప్రేమకథల్లో 'నిలవే' అలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అని అన్నారు. మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తితో నటుడైన తనకు, ఈ సినిమా తొలి విజయమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక దర్శకుడు సాయి కే వెన్నం మాట్లాడుతూ, సందీప్ రెడ్డి వంగా మాటలు తనలో స్ఫూర్తిని నింపాయని, కంటెంట్‌ను నమ్మి తీసిన ఈ సినిమా ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని తెలిపారు.

11 పాటలతో మ్యూజికల్ వండర్

మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ నాయక్ ఈ చిత్రంలో 11 అద్భుతమైన పాటలను అందించారు. కథలో భాగంగానే సాగే ఈ పాటలు యువతను కట్టిపడేస్తాయని చిత్ర యూనిట్ తెలిపింది. శ్రేయాసి సేన్ కథానాయికగా పరిచయం అవుతుండగా.. హర్ష చెముడు, సుప్రియా ఐసోలా ఇతర ముఖ్య పాత్రల్లో మెప్పించనున్నారు. POV ఆర్ట్స్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం, సరికొత్త POV టెక్నిక్‌తో, స్వచ్ఛమైన ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే వేసిన ప్రీమియర్ షోలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో మూవీ టీమ్ ఫుల్ ఖుషీగా ఉంది.