హనుమకొండ: మేడారం జాతర సందర్భంగా భక్తులు హుండీల్లో వేసిన కానుకల కౌంటింగ్ కొనసాగుతోంది. 7వ రోజు హుండీల కౌంటింగ్ కొనసాగింది. ఇప్పటివరకూ13 కోట్ల 25 లక్షల 83 వేల 269 రూపాయల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. కాయిన్స్ లెక్కించగా.. అత్యధికంగా 58 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. ఇప్పటివరకు 18 దేశాలకు చెందిన ఫారెన్ కరెన్సీ లభ్యమైంది. చివరి దశలో వన్ రూపీ కాయిన్స్ లెక్కింపు పెండింగ్లో పడింది.
గురువారంతో మొత్తం కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు తెలిపారు. గత జాతరతో పోలీస్తే ఈసారి 288 హుండీలు అదనంగా ఏర్పాటు చేసినా, ఆదాయం మాత్రం పెరిగే అవకాశం కనిపించడం లేదు. హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో పోలీస్, సీసీ కెమెరాల నిఘా మధ్య లెక్కింపు కొనసాగుతుంది.
ఇదిలా ఉండగా.. మేడారం మహాజాతరతో ఆర్టీసీకి రూ.20.24 కోట్ల ఆదాయం సమకూరింది. సోమవారం జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో సమావేశం నిర్వహించారు. చీఫ్ గెస్ట్‌గా హాజరైన ఆర్టీసీ ఈడీ కేఆర్‌జడ్పీ సోలోమన్ మాట్లాడుతూ మేడారం జాతరకు లక్షలాది మంది భక్తులను సురక్షితంగా జాతరకు తీసుకెళ్లి, గమ్యస్థానాలకు చేర్చడంలో కీలకపాత్ర పోషించిన ఉద్యోగులను అభినందించారు. ప్రయాణికుల రద్దీ మధ్య క్రమశిక్షణతో, సమన్వయంతో డ్రైవర్లు, కండక్టర్లు డ్యూటీ చేశారని కొనియాడారు.
వరంగల్ ఆర్ఎం దర్శనం విజయభాను మాట్లాడుతూ 1,711 బస్సులతో 25,027 ట్రిప్పులు నడిపించామని చెప్పారు. 28,06,155 కిలోమీటర్లు బస్సులు నడిపించడం ద్వారా రూ.20,24,28,124 ఆదాయం సమకూరిందని తెలిపారు. 12,33,585 మంది ప్రయాణించగా, 6,08,686 మంది మహిళలు మహాలక్ష్మి పథకాన్ని వినియోగించుకున్నారని చెప్పారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులకు మెమెంటోలు అందజేసి సత్కరించారు. డిప్యూటీ ఆర్ఎంలు కె. భాను కిరణ్, పి మహేశ్ పాల్గొన్నారు.
