రేపు.. 12న భారత్ బంద్ : బ్యాంకులు పని చేస్తాయా.. సెలవులో ఉంటాయా..!

రేపు.. 12న భారత్ బంద్ : బ్యాంకులు పని చేస్తాయా.. సెలవులో ఉంటాయా..!

ఫిబ్రవరి 12, 2026 (గురువారం) నాడు దేశవ్యాప్తంగా నిర్వహించనున్న భారత్ బంద్ కారణంగా సామాన్య ప్రజల్లో గందరగోళం నెలకొంది. అసలు ఆ రోజు బ్యాంకులు తెరిచి ఉంటాయా? పనులు జరుగుతాయా? అన్న ప్రశ్నలకు జవాబు తెలుసుకుందాం..

బ్యాంకులు తెరిచి ఉంటాయా? మూసి ఉంటాయా?

సాంకేతికంగా చెప్పాలంటే ఫిబ్రవరి 12ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గానీ, ప్రభుత్వం గానీ అధికారిక సెలవుగా ప్రకటించలేదు. అంటే బ్యాంకులు అధికారికంగా తెరిచే ఉంటాయి. అయితే దేశంలోని ప్రధాన బ్యాంక్ యూనియన్లు AIBEA, AIBOA, BEFI ఈ సమ్మెలో పాల్గొంటున్నందున, కార్యాలయాల్లో సిబ్బంది కొరత ఉండే అవకాశం ఉందని ఇప్పటికే కొన్ని బ్యాంకింగ్ సంస్థలు ఖాతాదారులను అలర్ట్ చేస్తూ ప్రకటనలు విడుదల చేశాయి. దీనివల్ల బ్యాంకులు తెరిచి ఉన్నా, సేవలు మాత్రం పాక్షికంగానే అందవచ్చు.

ఏ సేవలకు అంతరాయం కలగవచ్చు?

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో SBI, PNB, BoB వంటివి ఈ సమ్మె ప్రభావం ఎక్కువగా ఉండవచ్చు. దీని కారణంగా నగదు డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్, చెక్ క్లియరెన్స్, కొత్త లోన్ అప్లికేషన్ల పరిశీలన, డిమాండ్ డ్రాఫ్ట్ వంటి సేవలు నెమ్మదిగా కొనసాగవచ్చు. వీటిలో కొంత అంతరాయం ఉంటుందని ప్రాథమికంగా తెలుస్తోంది. 

అయితే ప్రైవేట్ రంగ బ్యాంకులైన HDFC, ICICI, యాక్సిస్ బ్యాంక్ వంటి వాటిలో యూనియన్ల ప్రభావం తక్కువ కాబట్టి అక్కడ సేవలు యథావిధిగా కొనసాగే అవకాశం ఉంది. అలాగే ఏటీఎంలు, నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్ సేవలకు ఎలాంటి ఆటంకం ఉండబోదు.

కస్టమర్లు ఏం చేయాలి?

SBI వంటి పెద్ద బ్యాంకులు ఇప్పటికే తమ కస్టమర్లను భారత్ బంద్ ప్రభావంపై హెచ్చరించాయి. సమ్మె కారణంగా బ్రాంచ్ సేవల్లో కొంత జాప్యం ఉండవచ్చని తెలిపాయి. కాబట్టి అత్యవసర బ్యాంకింగ్ పనులు ఏవైనా ఉంటే ఫిబ్రవరి 11నే పూర్తి చేసుకోవడం మంచిది. లేదంటే డిజిటల్ పేమెంట్లను వాడటం ద్వారా ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు. ఏదేమైనా ఫిబ్రవరి 12న బ్యాంక్ సేవల్లో అంతరాయాలు ఉండే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.