జీఎస్టీ కలెక్షన్లు పైపైకి..గతేడాదితో పోల్చితే 11 శాతం వృద్ధి.. తెలంగాణలో జూన్ నెల వసూళ్లు రూ.5,050 కోట్లు

జీఎస్టీ కలెక్షన్లు పైపైకి..గతేడాదితో పోల్చితే 11 శాతం వృద్ధి.. తెలంగాణలో జూన్ నెల వసూళ్లు రూ.5,050 కోట్లు
  • రాష్ట్రంలో జూన్‌‌‌‌‌‌‌‌ నెల జీఎస్టీ వసూళ్లు రూ. 5,050 కోట్లు
  • దేశ వ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లలో 14 శాతం పెరుగుదల

న్యూఢిల్లీ, వెలుగు: గూడ్స్ అండ్‌‌‌‌‌‌‌‌ సర్వీసెస్​ ట్యాక్స్ (జీఎస్టీ) వసూళ్లలో తెలంగాణలో  మరోసారి భారీ వృద్ధి నమోదైంది. గత జూన్‌‌‌‌‌‌‌‌లో రూ. 5,050 కోట్ల జీఎస్టీ వసూళ్లు సాధించింది. నిరుడు జూన్‌‌‌‌‌‌‌‌లో రూ. 4,548 కోట్లు జీఎస్టీ రూపంలో వసూలు కాగా.. ఈ సారి అదనంగా రూ.502 కోట్లతో 11 శాతం వృద్ధి సాధించింది. 

కాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) మొత్తంగా 10.2 శాతం గ్రోత్‌‌‌‌‌‌‌‌ నమోదైంది. కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం జూన్ నెలకు సంబంధించి దేశవ్యాప్త జీఎస్టీ వసూళ్ల వివరాలను వెల్లడించింది.  సెంట్రల్ జీఎస్టీ (సీజీఎస్టీ) రూపంలో రూ. 37, 376 కోట్లు, స్టేట్ జీఎస్టీ (ఎస్జీఎస్టీ) రూపంలో రూ. 45, 116 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (ఐజీఎస్టీ) రూపంలో రూ. 1, 12, 320 కోట్లు వసూలు అయ్యాయి.

ఇందులో దిగుమతుల రూపంలో రూ. 60, 038 కోట్లు ఉన్నాయి. కాగా.. మొత్తంగా గత నెల జూన్‌‌‌‌లో  దేశవ్యాప్తంగా రూ.1,94, 812 కోట్లు జీఎస్టీ వసూళ్లు నమోదైన ట్టు తెలిపింది. నిరుడు ఇదే నెలలో రూ.1,75, 105 కోట్లు జీఎస్టీ రూపంలో సమకూరినట్టు వెల్లడించింది. ఈ లెక్కన ప్రస్తుతం 13.9 శాతం గ్రోత్ నమోదైనట్టు గణాంకాలు వెల్లడించాయి. అధిక దేశీయ, దిగుమతి రాబడుల కారణంగా ఈ పెరుగుదల నమోదైంది. ఏప్రిల్ –జూన్ మధ్య స్థూల జీఎస్టీ వసూళ్లు రూ. 6,31,699 కోట్లకు చేరుకున్నాయి. జూన్ నెలలో గ్రాస్ డొమెస్టిక్ రెవెన్యూ రూ. 1,34, 774 కోట్లతో.. గతేడాదితో పోల్చితే 6.5 శాతం పెరుగుదలను నమోదు చేసింది.  స్థూల దిగుమతుల ఆదాయం 34.6 శాతం పెరిగి 60, 038 కోట్లకు చేరింది. ఫైనల్‌‌‌‌గా నికర జీఎస్టీ ఆదాయం నిరుడు జూన్​లో 1,4 5, 984 కోట్లు రికార్డు కాగా.. ఈ ఏడాది 11. 2 శాతం వృద్ధితో రూ. 1, 62, 377 కోట్లకు పెరిగింది.  

 వసూళ్లలో మహారాష్ట్ర టాప్‌‌‌‌

దేశీయ జీఎస్టీ వసూళ్లలో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. నిరుడు జూన్‌‌‌‌తో పోల్చితే 9 శాతం గ్రోత్‌‌‌‌తో రూ. 30, 714 కోట్ల వసూళ్లతో ముందజలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో కర్నాటక రూ. 12, 937 కోట్లతో 10 శాతం, గుజరాత్ రూ. 11, 743 కోట్లతో 12 శాతం వృద్ధిని నమోదు చేశాయి. 

ఇక పెద్ద రాష్ట్రమైన యూపీలో కేవలం రూ.9,165 కోట్లు వసూలు అయ్యాయి. అయితే గతేడాది జూన్​తో పోల్చితే (రూ. 7,675కోట్లు) 19 శాతం గ్రోత్ ఉంది. తమిళనాడులో స్వల్పంగా 2 శాతం గ్రోత్ తగ్గింది. ఇక్కడ రూ. 9, 776 కోట్లు వసూల య్యాయి. అలాగే, సిక్కింలో తీవ్ర పతనం నమోదైంది.  ఇక్కడ వసూళ్లు 53 శాతం తగ్గి.. కేవలం రూ. 170 కోట్ల ఆదాయం మాత్రమే సమకూరింది. అలాగే,  బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్య ప్రదేశ్, రాజస్తాన్‌‌‌‌లో మైనస్ ఐదు శాతానికి వసూళ్లు పడిపోయాయి. ఏపీలో మాత్రం 5 శాతం వృద్ధి నమోదైంది.