వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు ‘మిషన్ కే-100’..100 రోజుల ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం

వానాకాలం ధాన్యం  కొనుగోళ్లకు ‘మిషన్ కే-100’..100 రోజుల ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం
  •     ఎఫ్‌‌సీఐ ఉన్నతాధికారులతో సివిల్ సప్లయ్స్ కమిషనర్ భేటీ
  •     నిల్వలు, నిధులు, రవాణాపై ప్రత్యేక దృష్టి

హైదరాబాద్‌‌, వెలుగు: వానాకాలం సీజన్‌‌లో ధాన్యం కొనుగోళ్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగేలా రాష్ట్ర సివిల్ సప్లయ్స్ శాఖ ‘మిషన్ కే-100’ను ప్రారంభించింది. 100 రోజుల ప్రత్యేక కార్యాచరణతో కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా పాత ధాన్యం నిల్వలను త్వరగా తరలించడం, గోదాములను ఖాళీ చేయడం, పెండింగ్ బకాయిలు రాబట్టడం, రవాణా వ్యవస్థను బలోపేతం చేయడంపై శాఖ దృష్టి పెట్టింది. అలాగే కొనుగోలు కేంద్రాలను మరింత మెరుగుపర్చేందుకు చర్యలు చేపడుతోంది. బుధవారం సివిల్ సప్లయ్స్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఎఫ్‌‌సీఐ జనరల్ మేనేజర్ జీఎన్ రాజుతో ఉన్నతస్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. కొత్త పంట మార్కెట్‌‌కు వచ్చేలోపు గోదాముల్లో ఉన్న ధాన్యాన్ని తరలించి, కొత్త ధాన్యం నిల్వ చేసేందుకు తగిన స్థలం సిద్ధం చేయాలని నిర్ణయించారు. 

కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలను త్వరగా విడుదల చేయాలని కూడా కోరారు. జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన ‘మిషన్ కే-100’తో ధాన్యం నిల్వలు, రవాణా, నిధుల నిర్వహణ, కొనుగోలు కేంద్రాల పనితీరును గాడిలో పెట్టడమే లక్ష్యమని అధికారులు తెలిపారు. కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లుల్లో యంత్రాల వినియోగాన్ని పెంచి, కూలీలపై ఆధారపడటాన్ని తగ్గించాలని నిర్ణయించారు. ధాన్యం రవాణా వేగంగా జరిగేలా మరిన్ని వాహనాలు ఏర్పాటు చేసి, వాటి కదలికలను ప్రత్యేక ట్రాకింగ్ వ్యవస్థ ద్వారా పర్యవేక్షించనున్నారు. మిషన్ అమలుపై సివిల్ సప్లయ్స్ జిల్లా మేనేజర్లు, జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర.. వానాకాలం కొనుగోళ్లు మొదలయ్యేలోపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు