- ఒకేసారి జీర్ణాశయం, క్లోమం, చిన్న, పెద్దపేగులు, ఆంత్రమూలం ట్రాన్స్‌ప్లాంట్ చేసిన డాక్టర్లు
- సిరిసిల్లకు చెందిన 30 ఏండ్ల యువ ఇంజినీర్‌కు పునర్జన్మ
- దేశంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇలాంటి సర్జరీ ఇదే తొలిసారి
- కార్పొరేట్ హాస్పిటల్‌లో ఆపరేషన్ జరిగినా తగ్గని ట్యూమర్లు
- అవయవాల మార్పిడితో సమస్యకు చెక్ పెట్టిన సర్కార్ డాక్టర్లు
- డాక్టర్ల టీమ్‌కు సీఎం రేవంత్, మంత్రి దామోదర, నోటో అభినందనలు
హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా జనరల్ హాస్పిటల్ డాక్టర్లు దేశ వైద్య చరిత్రలోనే అరుదైన రికార్డును నెలకొల్పారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక పేషెంట్‌కు ఏకకాలంలో 5 అవయవాల మార్పిడి(మల్టీ-విసెరల్ ట్రాన్స్‌ప్లాంటేషన్)ని బుధవారం విజయవంతంగా పూర్తిచేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన 30 ఏండ్ల యువ ఇంజినీర్‌కు 36 గంటల పాటు నిరంతరాయంగా సర్జరీ నిర్వహించి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. సిరిసిల్ల జిల్లాకు చెందిన సదరు యువకుడు ‘ఫ్యామిలియల్ అడెనోమాటస్ పాలిపోసిస్(ఎఫ్ఏపీ)’ అనే అరుదైన జన్యు వ్యాధితో పాటు పెద్దపేగు క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు.
గతంలో ఓ కార్పొరేట్ హాస్పిటల్‌లో అతనికి ఆపరేషన్ చేసిన డాక్టర్లు పెద్దపేగును పూర్తిగా, చిన్నపేగులో 60 శాతాన్ని తొలగించారు. ఆ తర్వాత అతను తీవ్ర పోషకాహార లోపం, భరించలేని కడుపునొప్పి, బరువు తగ్గడం వంటి సమస్యలతో మంచంపట్టాడు. ఆరు నెలల క్రితం ఉస్మానియా ఆస్పత్రిని ఆశ్రయించాడు. ఇక్కడి డాక్టర్లు పరీక్షించగా చిన్నపేగు, డ్యూడినమ్ వంటి భాగాల్లో మరిన్ని ట్యూమర్లు ఉన్నట్లు గుర్తించారు. దీనికి అవయవ మార్పిడి ఒక్కటే మార్గమని తేల్చి, అతడిని జీవన్ దాన్‌లో నమోదు చేశారు.
బ్రెయిన్ డెడ్ మహిళ నుంచి అవయవాలు..
ఇటీవల గర్భధారణ సమయంలో అధిక రక్తపోటు (ప్రీ-ఎక్లాంప్సియా) కారణంగా మెదడులో రక్తస్రావమై 35 ఏళ్ల మహిళ ఉస్మానియాలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయ్యింది. వైద్యులు ఆమె కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించగా, వారు అవయవదానానికి అంగీకరించారు. దీంతో ఉస్మానియా గ్యాస్ట్రోఎంట్రాలజీ నిపుణుడు డాక్టర్ మధుసూదన్, ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్లు, అనస్థీషియా నిపుణులు, క్రిటికల్ కేర్ టీమ్ రంగంలోకి దిగింది. దాత నుంచి సేకరించిన జీర్ణాశయం, డ్యూడినమ్(జీర్ణాశయం, చిన్నపేగు మధ్య భాగం–ఆంత్రమూలం), ప్యాంక్రియాస్, చిన్నపేగు, కుడివైపు పెద్దపేగును అత్యంత సంక్లిష్టమైన సర్జరీ ద్వారా రోగికి అమర్చారు.
కోలుకుంటున్న పేషెంట్..
సుమారు 36 గంటల పాటు నిరంతరాయంగా సాగిన ఈ సర్జరీ విజయవంతమైందని డాక్టర్లు వెల్లడించారు. ప్రస్తుతం పేషెంట్ ఆరోగ్యం నిలకడగా ఉందని, అతనికి వెంటిలేటర్‌ను కూడా తొలగించామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అమెరికా, బ్రెజిల్ వంటి కొన్ని దేశాల్లో మాత్రమే ఇలాంటి 5 అవయవాల మార్పిడి సర్జరీలు జరిగాయి. ఇప్పుడు భారత్‌లో అది కూడా ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ ఘనత సాధించడం విశేషం. ఈ విజయంపై నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ (ఎన్ఓటీటీవో) స్పందిస్తూ.. డాక్టర్స్ డే సందర్భంగా ఉస్మానియా డాక్టర్ల బృందాన్ని ప్రత్యేకంగా అభినందించింది.
ఉస్మానియా డాక్టర్లకు సీఎం అభినందన
సుదీర్ఘ ఆపరేషన్ నిర్వహించిన ఉస్మానియా హాస్పిటల్ డాక్టర్లు, ఇతర సిబ్బందికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. నేషనల్ డాక్టర్స్ డే రోజున ఉస్మానియా హాస్పిటల్ వైద్య బృందం ఈ విజయాన్ని సాధించి వైద్య వృత్తికి మరింత ఆదర్శంగా నిలిచిందని సీఎం ప్రశంసించారు.
ప్రభుత్వ డాక్టర్ల డెడికేషన్‌కు నిదర్శనం: మంత్రి దామోదర
దేశ వైద్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచే ఘనతను ఉస్మానియా డాక్టర్లు సాధించారని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా కొనియాడారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ వైద్యరంగాన్ని అత్యాధునిక సాంకేతికతతో బలోపేతం చేస్తున్నామని, దానికి ఈ విజయమే నిదర్శనమన్నారు. ఈ ఆపరేషన్ కోసం శ్రమించిన సర్జన్లు, నర్సింగ్ సిబ్బంది, కోఆర్డినేటర్లను అభినందించారు. బ్రెయిన్ డెడ్ అయిన మహిళ అవయవాలను దానం చేసిన ఆమె కుటుంబసభ్యులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
