ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల కోసం తీసుకురాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రైవసీ ఫీచర్‌కు భారత ప్రభుత్వం రూపంలో పెద్ద బ్రేక్ పడేలా ఉంది. ఇకపై ఫోన్ నంబర్లతో పనిలేకుండా.. కేవలం 'యూజర్‌నేమ్స్' ద్వారా చాట్ చేసుకునే సరికొత్త వ్యవస్థను వాట్సాప్ సిద్ధం చేస్తోంది. అయితే ఈ ప్రైవసీ నిర్ణయంపై భారత కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెట్టబోతోందని సమాచారం. ఆన్‌లైన్ మోసాలు, యూజర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త సిస్టమ్‌ను క్షుణ్ణంగా పరిశీలించాలని కేంద్రం నిర్ణయించింది.
ప్రస్తుతం దేశంలో డిజిటల్ స్కామ్‌లు, సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో ఈ 'యూజర్ ఐడీ' ఫీచర్ రాబోతోంది. ఈ నేపథ్యంలో ఫోన్ నంబర్లు దాచిపెట్టి కేవలం యూజర్‌నేమ్స్ మాత్రమే వాడటం వల్ల సైబర్ నేరగాళ్లను గుర్తించడం పోలీసులకు మరింత సవాలుగా మారుతుందా? లేదా అనేది ప్రభుత్వ అధికారులు అధ్యయనం చేయనున్నారు. ఒకవేళ ఈ సమీక్షలో ఎలాంటి లోపాలు లేదా అనుమానాస్పద అంశాలు కనిపించినా.. వాట్సాప్ మాతృసంస్థ మెటాకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.
వాట్సాప్ నిబంధనల ప్రకారం.. రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ ఫీచర్‌ను విడతల వారీగా రోల్‌అవుట్ చేయనున్నారు. యూజర్లు తమ ప్రొఫైల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి గరిష్టంగా 35 క్యారెక్టర్ల లోపు ఒక ప్రత్యేకమైన యూజర్‌నేమ్‌ను రిజర్వ్ చేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. ఎప్పుడు కావాలన్నా ఈ పేరును మార్చుకోవచ్చు లేదా తీసేయెుచ్చు. అయితే ప్రముఖులు, సెలబ్రిటీల పేర్లను ఇతరులు దొంగిలించకుండా కొన్ని హై-ప్రొఫైల్ పేర్లను వాట్సాప్ ముందే లాక్ చేసి ఉంచనుంది.
►ALSO READ | ఆధార్ యూజర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆ సేవలు ఇకపై పూర్తిగా ఉచితం
ఫోన్ నంబర్ షేర్ చేయడం ఇష్టం లేని వారికి.. ముఖ్యంగా గ్రూప్ చాట్స్‌లో ప్రైవసీ కోరుకునే వారికి ఈ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుందని వాట్సాప్ ప్రొడక్ట్ హెడ్ ఆలిస్ న్యూటన్-రెక్స్ తెలిపారు. బిజినెస్ ఖాతాల కోసం ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో ఉన్న యూజర్‌నేమ్‌లనే ఇక్కడ కూడా లింక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. అయితే ఈ ఫీచర్ వల్ల నకిలీ ఖాతాలు పెరిగిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి రక్షణగా వాట్సాప్ 'యూజర్‌నేమ్ కీస్' అనే అదనపు సెక్యూరిటీ లేయర్‌ను కూడా ప్రవేశపెట్టనుంది.
వాట్సాప్‌లో మెసేజ్‌లు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో సురక్షితంగా ఉంటాయని సంస్థ చెబుతున్నప్పటికీ, ప్రభుత్వ భద్రతా సంస్థలు మాత్రం యూజర్ సేఫ్టీ విషయంలో రాజీ పడకూడదనే పట్టుదలతో ఉన్నాయి. టెక్నాలజీ పరంగా ఇది సూపర్ ప్రైవసీ అప్‌డేట్ అయినప్పటికీ.. ప్రభుత్వ నిబంధనలు, భద్రతా ప్రమాణాలను దాటుకుని ఈ ఫీచర్ భారతదేశంలో ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రజలు కూడా ఇది వస్తే ఎదురయ్యే సమస్యలు, మోసాల పట్ల అప్రమత్తంగా ఉండక తప్పదు.
