వరంగల్‌కు మరో భారీ రైల్వే ప్రాజెక్ట్: వెయ్యి కోట్లతో తెలంగాణలోనే తొలి మెగా వ్యాగన్ రిపేర్ సెంటర్!

వరంగల్‌కు మరో భారీ రైల్వే ప్రాజెక్ట్: వెయ్యి కోట్లతో తెలంగాణలోనే తొలి మెగా వ్యాగన్ రిపేర్ సెంటర్!

తెలంగాణ రాష్ట్రంలో రైల్వే వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ, వరంగల్ ప్రాంతంలో గూడ్స్ రైలు పెట్టెల (వ్యాగన్ల) రిపేర్ కోసం ఒక భారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇది రాష్ట్రంలోనే మొట్టమొదటి మెగా ఫ్రైట్ ఓవర్‌ హాలింగ్(POH) సౌకర్యం. సాధారణంగా గూడ్స్ రైళ్లకు చిన్న చిన్న రిపేర్లు కాజీపేట లేదా రామగుండం వంటి చోట్ల జరుగుతాయి. కానీ ఈ కొత్త కేంద్రంలో  రైలు పెట్టెలను పూర్తిగా విడదీసి, ప్రతి భాగాన్ని క్షుణ్ణంగా చెక్  చేసి, మళ్లీ కొత్తవాటిలా అమర్చుతారు దీనినే POH అంటారు. ఈ ప్రక్రియ వల్ల సరుకు రవాణా చేసే రైళ్లు మరింత సురక్షితంగా, వేగంగా ప్రయాణించగలవు.

ప్రస్తుతం తెలంగాణ వ్యాగన్లను రిపేర్ కోసం ఆంధ్రప్రదేశ్‌లోని రాయనపాడుకు పంపిస్తున్నారు. కొత్త సెంటర్ వస్తే ఇబ్బందులు తప్పి,   ఖర్చు కూడా తగ్గుతుంది.

ప్రాజెక్ట్ వివరాలు చూస్తే:
ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు రూ.1,000 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇంకా  కాజీపేట - మహబూబాబాద్ మధ్య దాదాపు 200 నుండి 300 ఎకరాల స్థలం కోసం రైల్వే అధికారులు వెతుకుతున్నారు. ఈ కేంద్రం ఏర్పాటుతో వందలాది మందికి ఉద్యోగ అవకాశాలు కూడా  లభిస్తాయి.

వరంగల్ ఇప్పటికే రైల్వే తయారీ యూనిట్‌ ఉంది. ఇప్పుడు ఈ మెగా రిపేరింగ్ సెంటర్ కూడా వస్తే, వరంగల్ ఒక కీలకమైన రైల్వే హబ్‌గా మారుతుంది. ముఖ్యంగా మన దగ్గర బొగ్గు, సిమెంట్, ఉక్కు రవాణా ఎక్కువగా జరుగుతుంది కాబట్టి, ఈ కేంద్రం చాలా అవసరం. భూమి సేకరణ పూర్తయ్యాక పనులు మొదలవుతాయి. రాబోయే 3 నుండి 5 ఏళ్లలో ఈ కేంద్రం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.