చిత్తుగా ఓడిన ఇంగ్లండ్.. టార్గెట్ 197..166కి ఆలౌట్.. వెస్టిండీస్ ఇలా దెబ్బ కొట్టింది !

చిత్తుగా ఓడిన ఇంగ్లండ్.. టార్గెట్ 197..166కి ఆలౌట్.. వెస్టిండీస్ ఇలా దెబ్బ కొట్టింది !

టీ20 వరల్డ్ కప్ 2026లో వెస్టిండీస్ టీం అదరగొట్టింది. ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో ఆల్ రౌండ్ షోతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇంగ్లండ్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో వెస్టిండీస్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. వెస్టిండీస్ టీం నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. 197 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ జట్టు 166 పరుగులు చేసి 19 ఓవర్లకే ఆలౌట్ అయింది. 

వెస్టిండీస్ బ్యాటర్ రూథర్ ఫర్డ్ 7 సిక్సులు, 2 ఫోర్లతో 76 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి సత్తా చాటాడు. బ్రాడన్ కింగ్ (1), షై హోప్ (0) నిరాశపరిచినప్పటికీ రూథర్ ఫర్డ్ 73 పరుగులతో పాటు హెట్ మెయిర్ 23 పరుగులు, రోస్టన్ చేజ్ 34 పరుగులు, హోల్డర్ 33 పరుగులు, పావెల్ 14 పరుగులు చేయడంతో వెస్టిండీస్ 196 పరుగులు చేసింది. 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టును విండీస్ బౌలర్లు కట్టడి చేశారు. 

38 పరుగుల దగ్గర ఇంగ్లండ్ ఫిలిప్ సాల్ట్ వికెట్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. 74-2, 85-3, 90-4, 131-5, 134-6, 141-7, 151-8, 161-9, 166-10.. ఇలా ఇంగ్లండ్ జట్టు 166 పరుగులకే ఆలౌట్ అయింది. ఒక ఓవర్ మిగిలి ఉండగానే ఇంగ్లండ్ చేతులెత్తేసింది. సామ్ కరన్ 43 పరుగులతో నాటౌట్గా నిలిచినా ఫలితం లేకుండా పోయింది. ఫిలిప్ సాల్ట్ 30 పరుగులు, జాకబ్ బెథెల్ 33 పరుగులు, జాస్ బట్లర్ 21, కెప్టెన్ బ్రూక్ 17 పరుగులకే పెవిలియన్కు చేరారు.

జోఫ్రా ఆర్చర్, లియామ్ డాసన్ రనౌట్ కావడం గమనార్హం. వెస్టిండీస్ బౌలర్లలో గుడాకేష్ మోతీ 3 వికెట్లతో రాణించాడు. రోస్టన్ చేజ్ 2 వికెట్లు, జోసెఫ్, రొమారియో షెఫర్డ్ , అకేల్ హోసెన్ తలో వికెట్ తీసి విండీస్కు విజయాన్ని కట్టబెట్టారు. 76 పరుగులతో నాటౌట్ గా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన రూథర్ ఫర్డ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.