ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా భారత్ బంద్ వాతావరణం నెలకొనబోతోంది. కార్మిక చట్టాల్లో మార్పులు, కొత్త లేబర్ కోడ్‌లు, ఇటీవల ప్రకటించిన భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా 10 ప్రధాన కార్మిక సంఘాలు.. రైతు సంఘాలు కలిసి ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. దీనివల్ల సామాన్య ప్రజలు రేపు బయటకు వెళ్లేముందు అసలు ఏవి తెరిచి ఉంటాయి.. ఏవి మూసి ఉంటాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఎందుకు ఈ సమ్మె?
ప్రభుత్వం పాత 29 కార్మిక చట్టాల స్థానంలో తీసుకొచ్చిన 4 కొత్త లేబర్ కోడ్‌లు కార్మికుల హక్కులను హరిస్తున్నాయని.. యజమానులకు అధికారం కట్టబెడుతున్నాయని ట్రేడ్ యూనియన్లు ఆరోపిస్తున్నాయి. మరోవైపు భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం వల్ల దేశీయ వ్యవసాయం, డెయిరీ రంగాలు దెబ్బతింటాయని రైతు సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. అందుకే సంయుక్త కిసాన్ మోర్చా లాంటి పెద్ద రైతు సంఘాలు కూడా ఈ బంద్‌కు సపోర్ట్ ప్రకటించాయి.
బంద్‌తో ఏ సేవలు ప్రభావితమవుతాయి?
- బ్యాంకింగ్ సేవలు: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో లావాదేవీలకు ఆటంకం కలగవచ్చు. AIBEA, BEFI వంటి ప్రధాన బ్యాంకు యూనియన్లు సమ్మెలో పాల్గొంటున్నాయి. అయితే రిజర్వ్ బ్యాంక్ దీనిని సెలవుగా ప్రకటించలేదు. కాబట్టి ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఏటీఎంలు సాధారణంగానే పనిచేస్తాయి. అయితే కొన్ని బ్యాంక్ శాఖల్లో ఇబ్బందులు ఎదురవ్వొచ్చు.
- రవాణా వ్యవస్థ: పలు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులు, ఆటోలు, టాక్సీ యూనియన్లు సమ్మెకు సపోర్ట్ తెలిపాయి. దీనివల్ల దేశవ్యాప్తంగా కొన్ని చోట్ల రోడ్ల దిగ్బంధనం జరిగే అవకాశం ఉన్నందున ప్రయాణాలు ఆలస్యం కావొచ్చు.
- ప్రభుత్వ ఆఫీసులు: ఉద్యోగ సంఘాలు సమ్మెలో పాల్గొంటే ప్రభుత్వ కార్యాలయాల్లో హాజరు తగ్గి, పనులు నెమ్మదించే అవకాశం ఉంది.
- మార్కెట్లు: కొన్ని ప్రాంతాల్లో వ్యాపార సముదాయాలు, స్థానిక మార్కెట్లు మూసివేసే అవకాశం ఉంది బంద్ ప్రభావంతో.
మరి ఏవేవి తెరిచి ఉంటాయి..?
1. అత్యవసర సేవలు: ఆసుపత్రులు, అంబులెన్స్ సేవలు, మెడికల్ షాపులతో పాటు అత్యవసర వైద్య సేవలకు బంద్ నుంచి మినహాయింపు ఉంది.
2. విద్యుత్, నీటి సరఫరా: పబ్లిక్ యుటిలిటీ సేవలు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగుతాయి.
3. విమానాశ్రయాలు, రైల్వేలు: విమాన.. రైలు సర్వీసులు షెడ్యూల్ ప్రకారం నడుస్తాయి.. కానీ ప్రయాణికులు ఎయిర్‌పోర్టులు, స్టేషన్లకు చేరుకోవడంలో ఇబ్బందులు పడవచ్చు రవాణా అంతరాయాల వల్ల.
4. స్కూళ్లు, కాలేజీలు: జాతీయ స్థాయిలో విద్యాసంస్థల మూసివేతపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. అయితే స్థానిక పరిస్థితులను బట్టి కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కొన్ని విద్యాసంస్థలు సెలవు ప్రకటించే అవకాశం ఉంది. దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో కూడా అక్కడి పరిస్థితులకు అనుగుణంగా స్కూళ్లకు సెలవులు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
రేపు(ఫిబ్రవరి 12న) ప్రయాణాలు పెట్టుకున్న వారు ముందే ప్లాన్ చేసుకోవడం మంచిది. ముఖ్యంగా బ్యాంక్ పనులు ఏవైనా ఉంటే ఇవాళే పూర్తి చేసుకోండి లేదా ఆన్‌లైన్ సేవలను వాడుకోండి.
