మున్సిపల్ ఎన్నికల్లో 73.01 శాతం పోలింగ్.. 91.91% చౌటుప్పల్ ఫస్ట్.. 59.68% పోలింగ్తో నందికొండ లాస్ట్ !

మున్సిపల్ ఎన్నికల్లో 73.01 శాతం పోలింగ్.. 91.91% చౌటుప్పల్ ఫస్ట్.. 59.68% పోలింగ్తో నందికొండ లాస్ట్ !

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో 73.01 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో అత్యధికంగా 91.91 పోలింగ్ శాతం నమోదైంది. అత్యల్పంగా నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీలో 59.68 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. 

ఇక.. కార్పొరేషన్ల విషయానికొస్తే.. నల్గొండ కార్పొరేషన్లో అత్యధికంగా 77.36 శాతం పోలింగ్ నమోదు కాగా, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో అత్యల్పంగా 59.12 శాతం పోలింగ్ నమోదు కావడం గమనార్హం. రాష్ట్రంలోని ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు బుధవారం జరిగాయి.

2 వేల 569 వార్డులు,  412 డివిజన్లలో పోలింగ్ జరిగింది. మొత్తం 8 వేల 191 పోలింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్​జరిగింది. ఎన్నికల నిర్వహణ కోసం 40 వేల మందికి పైగా సిబ్బంది విధులు నిర్వర్తించారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడానికి ఎన్నికల సంఘం ప్రతీ పోలింగ్​కేంద్రంలో సీసీ కెమెరాలతో వెబ్​ కాస్టింగ్​ చేసింది. ఫిబ్రవరి 13న ఉదయం 8 గంటల నుంచి 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్ల ఎన్నికల కౌంటింగ్ మొదలవుతుంది. మున్సిపల్​ ఎన్నికల్లో గెలుపోటములపై ఆయా పార్టీల నేతలు  ఎవరి ధీమాలో వారున్నారు.