దేశవ్యాప్తంగా ఉన్న10 సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ కారణంగా.. పలు ప్రభుత్వ రంగ సంస్థల సేవలు, బ్యాంకింగ్ సేవలు, రవాణా సేవలకు అంతరాయం కలిగే అవకాశాలున్నాయి. ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెకు, బంద్కు ట్రేడ్ యూనియన్లు ఎందుకు పిలుపునిచ్చాయంటే.. మన దేశంలో 2025, నవంబర్ 21వ తేదీ నుంచి వేతనాల కోడ్ (2019), పారిశ్రామిక సంబంధాల కోడ్ (2020), సామాజిక భద్రత కోడ్ (2020), వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్ (2020)లు అమలులోకి వచ్చాయి. గతంలో కార్మిక వర్గానికి రక్షణగా ఉన్న 29 చట్టాల స్థానంలో ఈ నాలుగు లేబర్ కోడ్స్ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది.
29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో లేబర్ కోడ్స్అమలు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకున్న రోజు నుంచే.. అంటే వేతన కోడ్ 2019లో ఆమోదించినప్పటి నుంచే కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. 2020 జనవరిలో స్వార్వత్రిక సమ్మెను నిర్వహించాయి. 2020 నవంబర్ 26న చారిత్రాత్మకంగా దేశవ్యాప్త సమ్మె జరిపాయి. 2025 జులై 9న సార్వత్రిక సమ్మె జరిగింది. ఇందులో 25 కోట్ల మందికి పైగా కార్మికులు భాగస్వాములై సమ్మెను విజయవంతం చేశారు.
కార్మిక సంఘాలు ఎన్ని అభ్యర్థనలు చేసినా, నిరసనలు వ్యక్తం చేసినా, సార్వత్రిక సమ్మెలు నిర్వహించినా పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్ను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో.. కేంద్రం అమలు చేస్తు్న్న నాలుగు లేబర్ కోడ్స్ను వ్యతిరేకిస్తూ.. లేబర్ కోడ్స్ను వెనక్కి తీసుకోవాల్సిందేననే డిమాండ్తో మరోమారు ఫిబ్రవరి 12, 2026న దేశవ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి.
* లేబర్ కోడ్‌లో రోజుకు 8 గంటల పని నిబంధన మార్చేశారు. 42 గంటల ప్యాకేజీ పేరిట పిలిచినప్పుడు వచ్చి పనిగంటలతో సంబంధం లేకుండా పని చేయడం వలన ఓటీ వేతనం వచ్చే అవకాశం లేదు.
* లేబర్ కోడ్‌లో అప్రెంటీస్‌ను కార్మికులుగా గుర్తించరు. గడువు ముగిశాక రెగ్యులర్ వర్కర్‌గా తీసుకోవడం యజమాని దయా దాక్షిణ్యాలపై ఆధారపడి ఉంటుంది
* ఉపాధి హామీ కార్మికులను, పనికి వేతనాలు పొందే వ్యవస్థను లేబర్ కోడ్‌లో కార్మికులుగా గుర్తింపు లేదు.
* 10 లక్షల ఆపైన విలువ గల భవన నిర్మాణ సంస్థలు 1% నుంచి 2% వరకు సెస్సు వసూలు చేసి, బిల్డింగ్ బోర్డ్‌కు జమ చేస్తాయి కానీ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ నిధులను వేరే చోట వినియోగిస్తూ చట్టాలను కాలరాసే ప్రయత్నం చేస్తున్నారు.
* లేబర్ కోడ్‌లో యూనియన్ గుర్తింపు నిబంధనలను కఠినతరం చేసి యూనియన్స్ను బలహీనపరిచే కుట్రపూరిత చర్యలకు కేంద్రం పాల్పడుతుందనేది కార్మిక సంఘాల వాదన
* కార్మిక సంఘాలు యాజమాన్యాలకు జరిగే సంప్రదింపులు రద్దు
* 100 మంది పనిచేసే కంపెనీలు మూసివేయాలన్నా లేక లే ఆఫ్ ప్రకటించాలన్నా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అనే నిబంధనను తొలగించిన కేంద్రం
* ఇప్పుడు 300 మంది పనిచేసే సంస్థలకు మాత్రమే అనుమతి అవసరమని మార్చడం కార్మిక హక్కుల చట్టం నీరు కార్చడమేననేది కార్మిక సంఘాల వాదన
* బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక చట్టాల వల్ల కార్మికులకు ఉద్యోగ భద్రత ఉండదని వాళ్ల వాదన
* కార్మిక హక్కులను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటీకరణ చేయటం వల్ల జీతాలు, వేతనాలు పెరగవు
* కార్మికులపై ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగ భద్రత లేకపోవటంతోపాటు వేతనాల పెంపుదల ఉండదు.
* అమెరికా నుంచి పాల ఉత్పత్తులు, గడ్డి, సోయాబిన్, నూనెలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు తగ్గించటం వల్ల దేశీయంగా రైతులకు తీవ్ర నష్టం వస్తుంది.
