- సీఎం రేవంత్‌కు బెదిరించుడు అలవాటైంది: కేటీఆర్
- మూసీలో అవినీతిని ప్రశ్నిస్తే శివతాండవం చేస్తమంటున్నడు
- బీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ విద్యార్థి విభాగం సమావేశంలో కామెంట్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో స్కాములు, అవినీతి గురించి ప్రశ్నిస్తే సీఎం రేవంత్ రెడ్డి బెదిరింపులకు దిగుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంత్రి పొంగులేటి అక్రమాలను ప్రశ్నించినప్పుడు కూడా ప్రతిపక్షాన్ని బెదిరించేలా మాట్లాడారన్నారు. రేవంత్ రెడ్డికి బెదిరింపులు అలవాటైపోయాయని, అలాంటి వాటికి బీఆర్ఎస్ భయపడదని చెప్పారు. శనివారం తెలంగాణభవన్‌లో నిర్వహించిన గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం సమావేశంలో మాట్లాడారు. మూసీలో అవినీతిని ప్రశ్నిస్తే ‘శివతాండవం చేస్తా’ అంటున్నారన్నారు. అవినీతి సొమ్ముల కోసం మూసీ పేరిట రూ.లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తానని ప్రకటించారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ హయాంలో రూ.16 వేల కోట్లతో రూపొందించిన సమగ్ర ప్రణాళికను పక్కనపెట్టి.. భారీ అంచనాలతో అవినీతికి తెరలేపారన్నారు. గత ప్రభుత్వం మూసీ నదిలో ఎస్టీపీలను దాదాపు పూర్తి చేసిందని, కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లను మూసీలోకి పంపించే ప్రణాళిక కూడా సిద్ధంగా ఉందని చెప్పారు. అయినా కూడా ప్రభుత్వం అంచనాలను పెంచి అవినీతికి బాటలు వేస్తున్నదన్నారు. మూసీ ఒడ్డున ఉన్న ఇండ్లు చట్టవిరుద్ధమని చెప్తున్న ప్రభుత్వం.. అదే ప్రాంతంలో భారీ హోటళ్లు, బిజినెస్ సెంటర్లు నిర్మించాలనుకోవడం దారుణమన్నారు.
విద్యార్థులకు విద్యాభరోసా కార్డులు, 2 లక్షల ఉద్యోగాలు, మెగా డీఎస్సీ, బ్యాక్లాగ్పోస్టుల భర్తీ హామీలను అమలు చేయలేదన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదన్నారు. దీనిపై ఏప్రిల్ మొదటి వారంలో మేధావులు, పర్యావరణ నిపుణులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామన్నారు. వెంటనే అంబేద్కర్ విగ్రహాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవాలని, లేదంటే ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా వేలాది మందితో వెళ్లి తాళాలు బద్దలు కొట్టి వేడుకలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.
రెండేండ్లు ఆగు రేవంత్.. నిన్నే బహిష్కరిస్తరు: సబితా ఇంద్రారెడ్డి
రేవంత్ రెడ్డికి ఎవరూ భయపడరని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మూసీకి తామేం వ్యతిరేకం కాదని, అక్కడ జరిగే విధ్వంసం, లక్ష కోట్ల స్కాంకు మాత్రమే వ్యతిరేకమని చెప్పారు. సీఎం తమను బ్లాక్మెయిల్ చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. తమను సామాజిక బహిష్కరణ చేయడం కాదని.. రెండేండ్లు ఆగితే రేవంత్‌నే బహిష్కరిస్తారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ రాజేంద్రనగర్ ఇన్చార్జి పట్లోళ్ల కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ మూసీ ప్రాజెక్టుపై బరాబర్ కొట్లాడుతామని అన్నారు. తమను అభివృద్ధి విరోధకులు అంటున్నారని, ఒక్క ఇల్లు తీసుకోకుండా చేస్తే తామే ముందుకొచ్చి కొబ్బరికాయ కొడతామని చెప్పారు. మూసీ పునరుజ్జీవం వల్ల ఎలాంటి లాభం లేదన్నారు.
